‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) హంగామా ఓ రేంజిలో సాగుతోంది. రూ. 1000 కోట్ల పోస్టర్ ఈ రోజు వచ్చేస్తుంది. దీంతో చాలా పెద్ద పని అయిపోయినట్లే. ఇక ఫైనల్ కలెక్షన్ల లెక్క పోస్టర్ రిలీజ్ చేయడం, రాసుకోవడం, షేర్ చేసుకోవడమే మిగులుతుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాల హడావుడి స్టార్ట్ అయిపోతుంది అని చెబుతున్నారు. తొలుత ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఓవర్సీస్ ఈవెంట్ జరగనుంది. దీని గెస్ట్ ఎవరు అనేదే లేటెస్ట్ టాక్.
Game Changer
డిసెంబర్ 21 అమెరికాలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓ ఇండియన్ సినిమాకు యూఎస్‌లో ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. దీంతో ఈ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో భాగంగా సినిమా నాలుగో లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలిసింది. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా లెక్కల మాస్టారు సుకుమార్ వస్తారట.
‘పుష్ప: ది రూల్’ విజయంతో మంచి ఉత్సాహం మీద ఉన్న ఆయన.. యూఎస్‌లో జరగబోయే ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కి హాజరవుతారట. దీనికి రెండు కారణాలున్నాయి అని కూడా అంటున్నారు. అందులో ఒకటి రామ్ చరణ్ (Ram Charan) 17వ సినిమా ఆయనదే. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారట. లేదంటే ఆగస్టులో అయినా ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందట.
ఇక రెండో విషయం. ‘పుష్ప 2’ విజయోత్సవాన్ని ఎన్ఆర్ఐలతో షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అని సుకుమార్ (Sukumar) అనుకుంటున్నారట. ఇక ‘గేమ్ ఛేంజర్’ సంగతి చూస్తే.. యుఎస్ ఈవెంట్ అయ్యాక డిసెంబర్ 28న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మరో ఈవెంట్ కూడా ఉంటుంది అని చెబుతునర్నారు. దాని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఆ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథి అని సమాచారం.