సాధారణంగా ఒక సినిమా తెరకెక్కిన తర్వాత ఆ సినిమా విడుదలకు ముందు తప్పనిసరిగా సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమాని చూసి అందులో ఏ విధమైనటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు మాటలు ఉన్న వాటిని తొలగించి సినిమా విడుదలకు అనుమతిస్తారు.అయితే ఇది కేవలం థియేటర్లో ప్రదర్శితమయ్యే సినిమాలకు మాత్రమే వర్తిస్తుంది కానీ ఇదే సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే సెన్సార్ కట్ చేసిన సన్నివేశాలతో సహా విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటుడు సుమన్ తాజాగా విజయవాడలో సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా అధ్యక్షుడు ఊళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్ధంతి కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు. కరోనా వంటి క్లిష్ట సమయాలలో థియేటర్లు మూత పడటంతో ఓటీటీల ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
ఓటీటీలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లో అశ్లీలత ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు సైతం ఇలాంటి వెబ్ సిరీస్ లను చూడటంతో వారిపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం చొరవ తీసుకొని ఓటీటీలు, వెబ్ సిరీస్ లపై కూడా సెన్సార్ దృష్టి పెట్టాలి అని సుమన్ తెలిపారు. ఇలాంటి వెబ్ సిరీస్ లకి కూడా సెన్సార్ నిబంధనలు ఉండటంవల్ల ఏ విధమైనటువంటి అశ్లీలత ప్రభావం ప్రేక్షకులపై పడదని సుమన్ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ విధంగా సుమన్ వెబ్ సిరీస్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే టికెట్ల రేట్లు గురించి ఈయన మాట్లాడుతు ఏపీ సీఎంని కలవడం కోసం ప్రయత్నం చేశానని అయితే అపాయింట్మెంట్ దొరకలేదని తెలిపారు.ఇక సినిమా టికెట్లు రేట్లు పెంచడం కన్నా సినిమాని కొనుగోలు చేస్తూ నష్టపోయిన బయ్యర్ల గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలని వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని సుమన్ తెలిపారు.