దర్శకధీరుడు రాజమౌళి కరోనా దెబ్బకు కాంప్రమైస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ స్క్రిప్ట్ లో పలు మార్పులు చేశారని తెలుస్తుంది. మహేష్ మూవీకి కూడా ఈ ప్రభావం తాకినట్టు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే…నిన్న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేశ్‌బాబు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ నిర్ణయించగా, మహేశ్ ని చెవికి పోగు, మెడపై రూపాయి టాటూ, మాసిన గడ్డంతో రఫ్‌గా పరిచయం చేశారు.
ఈ మహేశ్ మెడపై రూపాయి టాటూ వెనుక ఆసక్తికర కథ ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. పరుశురామ్ ఈ కథను తొలుత అమెరికా నేపథ్యంలో రాసుకున్నారట. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు సంభవించిన దేశంగా అమెరికా ఉంది.దీనితో అమెరికా నేపథ్యాన్ని ఇండియాకు మార్చారని సమాచారం. అమెరికా నేపథ్యంలో నడవాల్సిన ఈ కథను భారత్ లో నడిచేలా దర్శకుడు పరశురామ్ స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు చేశారట.
దాంతో డాలర్ సింబల్ మహేష్ మెడపై టాటూ వేయాల్సి ఉండగా, దాన్ని రూపాయి టాటూగా మార్చారట.ఇక సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ అనేక సోషల్ మీడియా రికార్డులు క్రియేట్ చేయగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ బ్యానర్స్ తో పాటు మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.