మలయాళ ప్రుమఖ నటి అపర్ణ నాయర్ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఆమె ఆగష్టు 31 రాత్రి 7 గంటలకు కేరళ, తిరువనంతపురంలోని కరమణ తలియాల్‌లో ఉండే తన ఇంట్లో అచేతన స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అపర్ణ మృతి పట్ల విచారించిన పోలీసులు.. భర్తతో గొడవల కారణంగానే ఆమ ఆత్మహత్య చేసుకుందని వారు తెలిపారు. భర్త అతిగా తాగడం, ఆమెను నిర్లక్ష్యం చేయడం వల్లే అపర్ణ ఆత్మహత్య చేసుకుందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
దీంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవని నివేదిక పేర్కొంది. ఇంట్లో గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని అపర్ణ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆత్మహత్యకు ముందు అపర్ణ తన తల్లికి వీడియో కాల్ చేసి ఇంట్లోని సమస్యల గురించి విలపించినట్లు సమాచారం. నేను వెళ్లిపోతున్నాను పిల్లలు జాగ్రత్త అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అపర్ణ.. తన అమ్మగారితో కొంత సమయం మాట్లాడి ఫోన్ కట్ చేసింది. ఈ వీడియో కాల్ ఆగష్టు 31 సాయంత్రం 6 గంటలకు జరిగింది. అనంతరం రాత్రి 7 గంటలకు అపర్ణ ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త సంజిత్ గుర్తించి వెంటనే (Aparna Nair) అపర్ణ తల్లి బీనా, సోదరి ఐశ్వర్యలకు సమాచారం అందించాడు. దీని ఆధారంగా ఐశ్వర్య వెంటనే అక్కడికి చేరుకునే సరికి అపర్ణ మంచంపై పడి ఉంది. వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అపర్ణ కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ సిద్ధం చేశారు. ప్రస్తుతం సంజిత్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
అపర్ణ, సంజిత్‌లకు ఇది రెండో వివాహం. అపర్ణకు మొదటి వివాహం నుంచి ఒక కుమార్తె ఉండగా.. ఆమెకు సంజిత్‌కు జన్మించిన మూడేళ్లు కుమార్తె ఉంది. మొదట్లో వీరి జీవితం బాగానే సాగినా భర్త అతిగా తాగడం వల్ల తరచూ గొడవలు జరిగేవి. అపర్ణ తన బంధువులకు చాలాసార్లు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని బంధువులు తెలిపారు. అపర్ణా నాయర్ 2005లో మయూఖం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అలా సుమారు 50 పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.