‘అమరన్’ (Amaran) సినిమా అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శివ కార్తికేయ (Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి (Sai Pallavi) ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ప్రత్యేకత ఏంటంటే.. ఈ కథ ఊహించి రాసింది కాదు, రియల్ కథ. సాయి పల్లవికి ఈ సినిమాలో కనిపించే పాత్ర నిజజీవిత గాథను ఆధారంగా రాసినదే. ఈ చిత్రం మేజర్ ముకుంద్ జీవిత ఆధారంగా తెరకెక్కించారు.
Amaran
అలాగే ఇందు వర్గీస్ అనే ధైర్యవంతురాలైన మహిళ జీవితం చుట్టూ మరో ఆసక్తికరమైన అంశం ఉంటుంది. ఆమె తన భర్త ముకుంద్‌తో గడిపిన కొద్దిపాటి కాలం, వారి అమర ప్రేమ కథకు ప్రతీకగా మారింది. ముకుంద్ మిలిటరీ ఆఫీసర్‌గా ఉండగా, ఇందు అతన్నీ ఎంతగానో ప్రేమించే అమ్మాయిగా చరిత్రలో నిలిచింది. మొదట వారి స్నేహం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో మొదలై, ప్రేమగా మారింది. అయితే ముకుంద్ తమిళ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చాడు, ఇక ఇందు క్రైస్తవ కుటుంబంకు చెందిన అమ్మాయి.
వారి ప్రేమకు ఇరు కుటుంబాల అంగీకారం అంత ఈజీగా రాలేదు. చాలా రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక అందరిని ఒప్పించి ముకుంద్‌ను తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్న ఈ కేరళమ్మాయి దేశభక్తితో ఉన్న అతడి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ అతనితో జీవితాన్ని నడిపించాలనుకుంది. ఆఫీసర్‌గా ఎదిగి, తక్కువ సమయంలోనే మేజర్ హోదాకు చేరుకున్న ముకుంద్ జమ్మూ కాశ్మీర్‌లో పోరాడి, తీవ్రవాదులను ఎదిరించడంలో ప్రాణత్యాగం చేశాడు.
ముఖ్యంగా అందరూ ఆమె బాధను గమనించే సమయములో, ఆమె మాత్రం ‘‘మా బాధ కాదు.. ఆయన ధైర్యం చూడండి’’ అని తన భావోద్వేగాన్ని చూపించిన విధానం దేశాన్ని ఆకర్షించింది. ఐదేళ్ల వైవాహిక జీవితంలో అతి తక్కువ సమయమే గడిపిన ఇందు, భర్త విజయాలను తన విజయాలుగా భావించింది. ఈ నిస్వార్థమైన ప్రేమ, దేశ సేవకు అంకితమైన ధైర్యం.. ఇలాంటి అద్భుతమైన కథను అందరికీ తెలియజేయాలని ‘అమరన్’ దర్శక నిర్మాతలు భావించారు. ఇందు పాత్రలో సాయి పల్లవి జీవించి, ఆ ఎమోషన్స్‌ను ప్రేక్షకుల మదిలో నింపేందుకు సిద్ధమైంది.