స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కోసం ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిందే. బాహుబలి, బాహుబలి2 సినిమాల కోసం ఆరేళ్ల సమయం కేటాయించిన జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నాలుగేళ్ల సమయం కేటాయించారు. ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 1135 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
ఈ సినిమా వల్ల జీ5, నెట్ ఫ్లిక్స్ కు సబ్ స్క్రైబర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న ఒక తప్పు చేశారని ఎన్టీఆర్, చరణ్ అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బాహుబలి2 రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడానికి ఇతర దేశాల కలెక్షన్లు కూడా కారణమనే సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ కట్ ను సిద్ధం చేసి చైనా, యూరప్ దేశాలలో బాహుబలి2 సినిమాను జక్కన్న విడుదల చేశారు.
అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం జక్కన్న ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఆర్ఆర్ఆర్ రేంజ్ ను పెంచే దిశగా జక్కన్న ప్రయత్నాలు చేయకపోవడంతో అభిమానులు సైతం ఒకింత ఫీలవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న హిందీ వెర్షన్ ను హాలీవుడ్ ప్రేక్షకులు, సెలబ్రిటీలు సైతం చూస్తూ ఈ సినిమాకు సంబంధించిన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో జాగ్రత్త పడి ఉంటే ఈ సినిమా మరో 200 నుంచి 300 కోట్ల రూపాయల కలెక్షన్లు అదనంగా సాధించే అవకాశం అయితే ఉంటుంది. చైనా, జపాన్ దేశాలలో ఈ సినిమాను విడుదల చేసి ఉంటే మంచి ఫలితం దక్కేది. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా భారీ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేసింది. బుల్లితెరపై కూడా ఈ సినిమా త్వరలో ప్రసారమయ్యే ఛాన్స్ అయితే ఉంది.