ప్రముఖ యూట్యూబ్ యాంకర్, నటుడు, జర్నలిస్ట్ టీఎన్‌ఆర్ కరోనా బారిన పడి చికిత్సకు కోలుకోలేక రెండు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. చిరంజీవి లక్ష రూపాయలు, సంపూర్ణేష్ బాబు 50 వేల రూపాయలు సాయం చేయగా తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఆయన కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసింది.
అయితే టీఎన్‌ఆర్ చనిపోవడానికి కొన్నిరోజుల ముందు “నా ప్రేమకే సెలవు.. నా దారికే సెలవు” అంటూ పాడిన పాట నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పాటలో ” ఈ శూన్యం నా గమ్యం.. ఈ జన్మకే సెలవు” అంటూ టీఎన్‌ఆర్ పాట పాడటంతో ఆయన తన మరణాన్ని ముందే ఊహించారా..? అంటూ కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను విన్న తరువాత టీఎన్‌ఆర్ అభిమానులకు ఏడుపు ఆగడం లేదు.
కేవలం 45 సంవత్సరాల వయస్సులోనే టీఎన్‌ఆర్ కరోనాతో కన్నుమూయడం ఆయన అభిమానులను కలచివేసింది. నీరాజనం సినిమాలోని పాటను ఆయన తెలిసి పాడారో తెలియక పాడారో అని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. చనిపోయే కొన్నిరోజుల ముందు యాదృచ్ఛికంగా టీఎన్‌ఆర్ ఈ పాటను పాడటం గమనార్హం. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తిని సినిమా ఇండస్ట్రీ కోల్పోయిందంటూ టీఎన్‌ఆర్ మృతి గురించి పలువురు అభిప్రాయపడుతున్నారు.