టాలీవుడ్ లో కరోనా సమయంలో రిలీజ్ డేట్స్ గందరగోళం ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఒక డేట్ ఇచ్చి దాన్ని మళ్లీ మార్చాలంటే వందసార్లు ఆలోచించేవారు. అదొక నెగెటివ్ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేవాళ్లు. కానీ కరోనా తరువాత దర్శకనిర్మాతల్లో ఆ ఫీలింగ్ పోయింది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా రిలీజ్ డేట్ నే చాలా సార్లు మార్చారు. దీంతో మిగిలిన సినిమాల రిలీజ్ డేట్స్ మార్చే విషయంలో ఎవరూ మొహమాటపడడం లేదు.
ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా.. సినిమాను వాయిదా వేసుకుంటున్నారు. అయితే పదేపదే రిలీజ్ డేట్స్ మార్చడం వలన గందరగోళం తప్పడం లేదు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఫిబ్రవరి సినిమాల విషయంలోనూ ఇప్పుడు ఇదే అయోమయం కనిపిస్తుంది. ఫైనల్ గా ఏ సినిమా ఎప్పుడు వస్తుందనేది ఫిక్స్ అయినట్లే కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ గందరగోళం తప్పడం లేదు.
ఈ నెల 17న ‘శాకుంతలం’ సినిమా వస్తుందనే అంచనాతో ఆరోజు రావాల్సిన విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ సినిమాను వెనక్కి జరిపారు. అలాగే ధనుష్ బైలింగ్యువల్ సినిమా ‘సార్’ను కూడా హోల్డ్ లో పెట్టారు. అయితే ఇప్పుడేమో ‘శాకుంతలం’ సినిమాను వాయిదా వేస్తారని అంటున్నారు. దీంతో ‘ధమ్కీ’, ‘సార్’ సినిమాల టీమ్ కి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. తమ సినిమాలు వాయిదా పడతాయనే అంచనాతో మెల్లగా వర్క్ చేసుకుంటున్నారు.
ఇప్పుడేమో ‘శాకుంతలం’ వాయిదాతో హడావిడి పడుతున్నారు. విశ్వక్ సేన్ సినిమా అయితే ఆరోజు వచ్చే ఛాన్స్ లేనట్లే. ధనుష్ సినిమాను మాత్రం 17నే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కోసం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాను ఒకరోజు వెనక్కి జరుపుతున్నారట. ఫిబ్రవరి 17న పోటీ తక్కువ ఉంటే.. శివరాత్రి వీకెండ్ ను వాడుకోవడం కోసం ఫిబ్రవరి 10న రావాల్సిన ‘అమిగోస్’ను వారం వెనక్కి జరిపే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఈ రిలీజ్ డేట్స్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి!