మెగాస్టార్ చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాడీ’. ఈ మూవీని ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. 2001 వ సంవత్సరం అక్టోబర్ 4న ఈ చిత్రం విడుదలైంది.నేటితో ఈ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తికావస్తోంది. అంతకు ముందు దర్శకుడు సురేష్ కృష్ణ, చిరు కాంబినేషన్లో వచ్చిన ‘మాష్టర్’ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ‘డాడీ’ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది ‘డాడీ’ చిత్రం.
అప్పటికి చిరు కూడా వరుస ప్లాపుల్లో ఉండడం వల్ల.. ఆ ఎఫెక్ట్ కూడా ‘డాడీ’ పై పడిందని చెప్పాలి. అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ చిరు కాదట. వేరే హీరో రిజెక్ట్ చేయడంతో.. ఈ కథ చిరు వద్దకు వెళ్ళిందట. ఆ హీరో మరెవరో కాదు… రాజశేఖర్. అవును మన యాంగ్రీ స్టార్ రాజశేఖరే..! ఈయన్ని దృష్టిలో పెట్టుకునే ‘డాడీ’ కథని రెడీ చేసుకున్నాడట దర్శకుడు సురేష్ కృష్ణ. ఈ కథ వినిపించడానికి ఆయనకి ఫోన్ చేయగా.. అప్పటికి రాజశేఖర్ వేరే సినిమాల షూటింగ్ లో ఉండడంతో వెయిట్ చేయాల్సి వచ్చిందట.
‘గీత ఆర్ట్స్’ వారికి ఈ కథని చేయాలని సురేష్ కృష్ణ భావించారు. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేసి చిరుతో చేస్తే బాగుంటుందని అరవింద్ గారు…దర్శకుడు సురేష్ కృష్ణకి చెప్పారట. చిరు ఈ కథని యాక్సెప్ట్ చేస్తారని సురేష్ కృష్ణ అస్సలు అనుకోలేదట. అయినప్పటికీ చిరు ఒకే చెప్పడం జరిగింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా కీలక పాత్ర పోషించడం, అలాగే పవన్ కళ్యాణ్ ఓ ఫైట్ ను కంపోజ్ చేయడం కూడా విశేషంగా చెప్పుకోవాలి.