‘మురారి’.. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన నాలుగో సినిమా.. ఫస్ట్ ఫిలిం ‘రాజకుమారుడు’ తర్వాత చేసిన ‘యువరాజు’ యావరేజ్, ‘వంశీ’ ఫ్లాప్ అయ్యాయి.. ఆ లోటుని భర్తీ చేస్తూ.. ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి మహేష్ బాబుని మరింత చేరువ చేసిన చిత్రం ‘మురారి’.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మార్క్ ఎమోషన్స్, క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లతో పాటు అందమైన పాటలు తోడవడంతో సూపర్ డూపర్ హిట్ అయింది.. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ‘మురారి’ 2023 ఫిబ్రవరి 17 నాటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
19వ శతాబ్ధంలో కథ మొదలవుతుంది.. ఆంగ్లేయుల దగ్గర తీసుకున్న అప్పు తీర్చేందుకు జమీందారు (ప్రకాష్ రాజ్) దుర్గా దేవి విగ్రహాన్ని దొంగిలించడానికి మద్యం సేవించి గుడిలోకి ప్రవేశిస్తాడు.. కూడా వచ్చిన ఆంగ్లేయులు, ఆ తర్వాత అమ్మ వారి చేతిలో జమీందారు ప్రాణాలు కోల్పోతారు.. దాంతో పాటు జమీందారు వంశానికి ఓ శాపం పెడుతుంది.. ఆ శాపం ప్రకారం ప్రతీ 48 ఏళ్ళకొకసారి వచ్చే ఆశ్వయిజ బహుళ అమావాస్య నాడు అమ్మవారు ఆ ఇంట్లో ఒక మగాడిని బలితీసుకుంటుంది..
అలా ఆ కుటుంబానికి చెందిన వారసులు (నాగబాబు – అచ్యుత్) మరణిస్తారు.. తర్వాత ‘మురారి’ వంతు.. ఆ శాపం నుండి విముక్తి పొందడానికి, అమ్మవారిని శాంతింపజేయడానికి బామ్మ శబరి ఎలాంటి యజ్ఞ యాగాదులు చేసి.. మనవడిని ఎలా కాపాడుకుంది అనేది కథ.. సినిమా రిలీజ్ అప్పుడు.. ‘‘ఈ చిత్ర ప్రారంభాన్ని మిస్ కాకండి’’ అని ప్రకటనలిచ్చేవారు.. ఎందుకంటే స్టార్టింగ్ నుండి చూస్తేనే కథ క్లారిటీగా అర్థమవుతుందని.. మహేష్ అప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు..
కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు.. సోనాలీ బింద్రే – మహేష్ బాబుల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.. మణిశర్మ ఇచ్చిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యాయి.. కృష్ణవంశీ తన స్టైల్ మేకింగ్‌తో ఆకట్టుకున్నారు.. అయితే సీనియర్ నటి లక్ష్మీ క్యారెక్టర్ కాస్త అతిగా అనిపించడంతో మ్యాట్నీకే కొన్ని సీన్స్ కట్ చేశారు.. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ మీద నందిగం గోపి, ఎన్. దేవీ ప్రసాద్, రామలింగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు రాబట్టింది..
ముచ్చటగా మూడు నంది అవార్డులు గెల్చుకుంది.. సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం (సిల్వర్ నంది), బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (లక్ష్మీ), స్పెషల్ జ్యూరీ (మహేష్) అవార్డులు అందుకున్నారు.. సి. రామ్ ప్రసాద్ కెమెరామెన్ కాగా.. తర్వాత ప్రభాస్‌తో ‘వర్షం’ తీసిన డైరెక్టర్ శోభన్ ఈ మూవీకి డైలాగ్స్ రాయడం విశేషం..