తెలుగులో “అప్పట్లో ఒకడుండేవాడు, పటేల్ సర్” చిత్రాల్లో నటించి కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఇప్పటికీ పరితపిస్తున్న తాన్యా హోప్ కి కన్నడ చిత్రసీమ నుండి బంపర్ ఆఫర్ వచ్చింది. కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లిపోవడానికి ముందు ఒక సినిమా చేయనున్నాడు. అదే నటుడిగా ఆయన ఆఖరి సినిమా కాకపోయినా కథానాయకుడిగా మాత్రం ఇదే చివరి సినిమా అని స్వయంగా ఆయనే ప్రకటించడం విశేషం. రాజకీయ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభమవ్వనుంది.
ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన మెయిన్ హీరోయిన్ గా తాన్యా హోప్ నటించనుంది. ఉపేంద్ర ఆఖరి సినిమా కావడంతో నిర్మాణ పరంగానే కాక పబ్లిసిటీ కూడా పీక్స్ లో ఉంటుంది. తెలుగులో సరైన గుర్తింపు లేక, రాక ఇబ్బందిపడుతున్న తాన్యా హోప్ కి ఈ చిత్రం మంచి బూస్ట్ ఇవ్వనుంది. టాలీవుడ్ లో ఆమె ఎదుగుదలకు కన్నడ చిత్రం ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. కన్నడతోపాటు మలయాళం మరియు తమిళనాట కూడా తాన్యాకి ఈ చిత్రం మంచి పేరు తీసుకొస్తుంది. ఏప్రిల్ నుంచి సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.