అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే.. ఈ పాటికి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) – గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) సినిమా ప్రమోషన్స్ ఇప్పటికి జరుగుతుండేవి. నిర్మాత నాగవంశీ ఈపాటికి వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టేసేవారు. అలా అవ్వడం లేదు కాబట్టి.. ఇప్పుడు సినిమా టైటిల్‌ను ఓకే చేసే పనిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా చాలా రకాల పేర్లు వినిపిస్తున్నా.. ఇంకా ఏది ఓకే కావడం లేదు. త్వరలోనే ఓకే చేస్తాం అని అంటున్నారు.
VD 12
విజయ్ దేవరకొండ 12వ (VD 12) సినిమాకు సంబంధించి ఇప్పుడున్న హైప్‌నకు కారణం ఆ సినిమా నుండి వచ్చిన పోస్టర్. తక్కువ జుట్టుతో గట్టిగా అరుస్తున్న విజయ్ లుక్ సినిమా మీద హైప్ బాగా పెంచింది. దానికి తోడు సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారు అనే చర్చ ఒకటి బయటకు వచ్చింది. అందులో నిజానిజాలు తేలాలి అంటే సినిమా పేరు, లుక్ బయటకు రావాలి. అందుకే అందరూ వెయిట్ చేస్తున్నారు. వారికి త్వరలో గుడ్ న్యూస్ అంటున్నారు నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi).
సినిమా టీజర్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని చెబుతున్న టీమ్‌కు ముఖ్యంగా మూడు సమస్యలు ఉన్నాయి అంటున్నారు. అందులో ఒకటి టైటిల్ కాగా, రెండోది సంగీత దర్శకుడు అనిరుథ్ (Anirudh Ravichander) బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా సిద్ధం కాలేదట. ఇక ఆఖరి సమస్య సినిమా రిలీజ్ డేట్. మార్చి 28న సినిమాను తీసుకొస్తామని తొలుత చెప్పారు. కానీ ఇప్పుడు ఆ టైమ్‌కి సినిమా రెడీ అవ్వదు. కాబట్టి వేరే డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారట.
వీటి విషయంలో క్లారిటీ వస్తే కానీ టీజర్ బయటకు రాదు. ఇక టైటిల్ విషయానికొస్తే సినిమాకు ‘యుద్ధం’ నేపథ్యంలో టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నరట. తెలుగు, ఇంగ్లిష్ పేర్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి. మరి ఏం పేరు వెతికి పెడతారో సినిమా టీమ్ చూడాలి. మీకు ఏమన్నా ఐడియా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగవంశీ దృష్టికి తీసుకెళ్లండి.