ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ’వాతి’,(తమిళం) నేడు 10 గంటల 19 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య వైభవంగా జరిగింది. ఇటీవల ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్ర నాయకా,నాయికలు ధనుష్, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. ప్రముఖ నిర్మాతలు డా: కె.ఎల్.నారాయణ, ఎం.ఎల్. కుమార్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత మహేంద్ర చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందచేశారు. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.
“యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్” స్లోగన్ తో ఇటీవల ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన కథను దర్శక నిర్మాతలు మన ముందు ప్రెజెంట్ చేయనున్నారనే నమ్మకం కలిగించింది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం పేరుతో కూడిన విడుదల అయిన ప్రచార చిత్రాలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచాయి.
కేరళకు చెందిన చార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ‘సూదు కవ్వం’, ‘సేతుపతి’, ‘తెగిడి’, ‘మిస్టర్ లోకల్’, ‘మార’ వంటి చిత్రాలకు పనిచేసి తనదైన ముద్రవేసిన సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హృదయాన్ని హత్తుకొనే సంగీతం సమకూర్చడంలో దిట్ట అయిన జి.వి. ప్రకాష్‌కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, విశేషాలు వెల్లడిచేయనున్నట్లు తెలిపారు నిర్మాతలు.