టాలీవుడ్‌లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న రొమాంటిక్ కామెడీ సినిమాల్లో పెళ్లి చూపులు (Pelli Choopulu) ఒకటి. 2016లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) కూడా ఒక గట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినా, కంటెంట్ బలం, యూత్‌ఫుల్ ఎమోషన్స్, హాస్యం కరెక్ట్‌గా పంచబడటంతో అది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఆ సినిమా ఇచ్చిన గుర్తింపు తర్వాత విజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి చూడలేదు. అర్జున్ రెడ్డి (Arjun Reddy), గీతా గోవిందం (Geetha Govindam) వంటి సినిమాలతో స్టార్ హోదా అందుకుని, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇదే సమయంలో తరుణ్ భాస్కర్ కూడా ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా లాంటి వైవిధ్యమైన ప్రాజెక్ట్స్‌తో తన స్టైల్ చూపించాడు. కానీ ఇద్దరూ మళ్లీ కలిసే అవకాశమే ఉందని చాలా.కాలంగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, పెళ్లి చూపులు 2 కోసం తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి కథ మరింత కంటెంట్ తో, విజయ్ స్థాయికి తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేశారని టాక్. కానీ, విజయ్ తన ప్రస్తుత పాన్ ఇండియా ప్రాజెక్టుల బిజీలో ఈ సినిమాను ఒప్పుకుంటాడా? లేదా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే, మరో విశేషం ఏమిటంటే, విజయ్ ఒప్పుకోకపోతే, తరుణ్ భాస్కర్ వేరే హీరోతో పెళ్లి చూపులు సీక్వెల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడట.
కాస్త న్యూ జెనరేషన్ హీరోతో ఈ సినిమాను కొత్త యాంగిల్ లో చూపించాలనే ఆలోచన కూడా ఉందట. అవసరమైతే విజయ్ తో గెస్ట్ రోల్ చేయించాలని కూడా ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ గాసిప్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మొత్తానికి పెళ్లి చూపులు సీక్వెల్ తప్పకుండా రానుంది. కానీ దాని ఫ్రంట్‌లో విజయ్ దేవరకొండ నిలుస్తాడా? లేక మరో హీరోతో ముందుకెళ్తారా? అనేది వేచిచూడాల్సిన విషయమే.