సినిమాకు పైరసీని మించిన నష్టం ఏదీ చేయదు అంటారు. చాలా ఏళ్లపాటు ఇబ్బంది పెట్టిన ఈ భూతం ఈ మధ్య కాస్త తగ్గింది అనుకుంటుండగా.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాతో మళ్లీ బయటికొచ్చింది. సినిమా విడుదలైన మూడు రోజులకే చేయాల్సిన నష్టం అంతా చేసేసింది. ఇప్పుడు ‘తండేల్’ (Thandel) సినిమా దగ్గరకు వచ్చేసరికి బుసలు కొడుతూ బెదిరించి భయపెడుతోంది. ఈ క్రమంలో సినిమాను ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులో వేసేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందా?
ఇదేం ప్రశ్న.. మొన్నీమధ్యే బన్ని వాస్ (Bunny Vasu), అల్లు అరవింద్ (Allu Aravind) ప్రెస్ మీట్ పెట్టి ఓ వాట్సప్ నెంబరు ఇచ్చి, వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. కేసులు పెడతామన్నారు కదా అని మీరు అనొచ్చు. అయితే అవన్నీ ఆధారాల కోసం టీమ్ చేస్తున్న ప్రయత్నాలే. అంటే ఎక్కడైనా పైరసీ సినిమా ప్రదర్శిస్తే చెప్పమని మాత్రమే. కానీ అలా వచ్చిన సమాచారంతో టీమ్ ఏం చేస్తోంది అనేదే ఇక్కడ ప్రశ్న. ఇప్పటివరకు ఎక్కడా, ఎవరి మీదా కంప్లైంట్‌లు ఇచ్చినట్లు సమాచారం లేదు.
‘తండేల్’ సినిమాను ఇటీవల శ్రీకాకుళం జిల్లా పలాస నుండి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ప్రదర్శించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు. ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్లిన బస్సులో ఈ సినిమాను ప్రదర్శించినట్లు ఆ పోస్టులో రాసుకొచ్చారు. మా సినిమా పైరసీని మరోసారి ప్రదర్శించారు. దీనివల్ల చిత్ర పరిశ్రమకు నష్టమొస్తోంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
దాంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో పైరసీ సినిమాను ప్రదర్శించకుండా కఠినమైన సర్క్యులర్‌లను జారీ చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు మరోసారి విజ్ఞప్తి చేశారు బన్ని వాస్. అయితే ఇప్పటివరకు ఆర్టీసీ నుండి ఈ విషయంలో ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఈ విషయంలో అసలు గీతా ఆర్ట్స్ ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించడం లేదు. ఎందుకు కంప్లైంట్‌లు ఇవ్వడం లేదు అనేది అర్థం కావడం లేదు.