ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించే ‘క్యూ అండ్ ఎ’ లు చాలా దారుణంగా ఉంటున్నాయి అనేది చాలా మంది చెబుతున్న మాట. అటెన్షన్ కోసం చాలా మంది నెగిటివ్ ప్రశ్నలు సెలబ్రిటీలను అడిగి.. హైలెట్ అవ్వాలని చూస్తున్నారు అని తెలిసి సదరు రిపోర్టర్ల మొహాలపై కెమెరాలు పెట్టడం మానేసినా.. ఎవ్వరూ తగ్గడం లేదు. అసలు ఏ ప్రెస్మీట్ కి వచ్చాము.. సందర్భం ఏంటి? ఎలాంటి ప్రశ్నలు సినిమా వాళ్ళని అడగాలి అనేది పూర్తిగా కొంతమంది రిపోర్టర్లు పక్కన పెట్టేసి..
అందరూ అటెన్షన్ కోసమే అన్నట్లు చెత్త ప్రశ్నలు అడుగుతున్నారు. విషయంలోకి వెళితే.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. అది అందరికీ తెలిసిందే. రాంచరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో, దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన సినిమా ఇది. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. ఫలితం నిరాశపరిచింది. వాస్తవానికి ఏ సినిమా ఫలితమైన అనుకున్నట్టు రాదు కదా..! సరే సినిమా ఆడలేదు. అది నిజం. అందులో డిబేట్ కూడా అవసరం లేదు. పోస్ట్ మార్టం చేసుకుంటే చాలా లోపాలు కనిపిస్తాయి.
సరే మేకర్స్ అంతా ఈ సినిమా ఫలితం దగ్గర ఆగిపోకుండా.. తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం పని చేయడం మొదలుపెట్టారు. కానీ మీడియా మాత్రం ఇంకా ‘గేమ్ ఛేంజర్’ దగ్గరే ఆగిపోయిందేమో అనిపిస్తుంది. ఈ మధ్య ఏ సినిమా వేడుక జరిగినా.. దానికి ‘గేమ్ ఛేంజర్’ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు వచ్చినా.. ఏదో ఒక రకంగా ఆ సినిమా గురించి అడిగి.. ఆ సినిమాలో భాగమైన వారిని ఇబ్బంది పెడుతున్నారు.
మొన్నటికి మొన్న ‘ఎల్ 2 ఎంపురాన్’ సినిమా ఈవెంట్ కి దిల్ రాజు వస్తే.. ఆయన్ని నాన్ స్టాప్ గా ఆ సినిమా గురించి అడిగి ఇబ్బంది పెట్టారు. అంతకు ముందు ‘మదగజరాజ’ ప్రమోషన్స్ కి వచ్చిన అంజలిని (Anjali) కూడా అలానే ఇబ్బంది పెట్టారు. ఇక ఈరోజు నవీన్ చంద్ర (Naveen Chandra) వంతు వచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ లో అతనొక చిన్న పాత్ర చేశాడు.
కానీ సినిమాలో మీ పాత్ర ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) రేంజ్లో లేదు అంటూ కొందరు రిపోర్టర్లు ఈరోజు జరిగిన ’28°C’ సినిమా టీజర్ లాంచ్లో ప్రశ్నించారు. దానికి నవీన్ చంద్ర ‘అలాంటి పెద్ద ప్రాజెక్టులో నేను భాగం అవ్వడమే నా అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ పాజిటివ్ ఆన్సర్ ఇచ్చినా రిపోర్టర్లు ఆపింది లేదు. ఇలా ‘గేమ్ ఛేంజర్’ బ్యాచ్ ని ఇంకా మీడియా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది.