ఈ సమాజంలో తొందరగా దెబ్బతినేవి ఏంటి? అంటే సినిమా వాళ్లు నోట వచ్చే తొలి మాట ‘మనోభావాలు’. ఈ మాట వినడానికి ఇబ్బందిగా అనిపించినా.. గత కొంత కాలంగా జరుగుతున్న అంశాలు చూస్తే ఈ మాట అనబుద్ధి వేస్తుంది. కావాలంటే మీరే చూడండి సినిమాల విషయంలోనే ఎక్కువగా ఈ ‘మనోభావాలు’ కాన్సెప్ట్ చర్చలోకి వస్తుంది. అందులోనూ ఇటీవల కాలంలోనే మరీ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అనుకుంటున్నారా? ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా గురించే.
రవితేజ (Ravi Teja) ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేసింది. దానిని చూసి తమ మనోభావాలు, తమ ఊరి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొంతమంది హైకోర్టు మెట్లు ఎక్కారు. సినిమా టీజర్‌లో చూస్తే… తమ ఊరి మనోభావాలు దెబ్బ తీసేలా డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయని ఆ పిల్‌లో పేర్కొన్నారు. ఆ పిల్‌ను పరిశీలించి, విచారణకు తీసుకున్న హైకోర్టు ఈ మేరకు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది.
‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో స్టూవర్ట్‌పురం గురించి చూపిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లే ఈ పిల్ వేశారని కూడా చెప్పక్కర్లేదు. అయితే ఇదే అంశం మీద గతంలో రెండు సినిమాలు వచ్చాయి. అంటే స్టూవర్ట్‌పురం ప్రాంతం నేపథ్యంలో రెండు సినిమాలొచ్చాయి. అందులో ఒకటి చిరంజీవిది అయితే, రెండోది భానుచందర్‌ది. అందులో చూపించిన అంశాలకు దగ్గరగానే ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా ఉంటుంది అంటున్నారు. ఈ మేరకు దర్శకుడు వంశీ కూడా గతంలో ఓసారి చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో గతంలో అంటే 1991లో చిరంజీవి – యండమూరి వీరేంద్రనాథ్ కాంబోలో ‘స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్’ సినిమా వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత భానుచందర్ సినిమా ‘స్టూవర్ట్‌పురం దొంగలు’ వచ్చినప్పుడు కానీ రాని సమస్య ఇప్పుడు రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’తో ఎందుకు వచ్చింది అనే చర్చ మొదలైంది. స్టూవర్ట్‌పురంలో అప్పటి పరిస్థితులు ఉన్నాయని ఇప్పుడు చెప్పడం లేదు. అయితే గతంలో ఉండేవి అని మాత్రం చెబుతున్నాం అని టీమ్ అంటోంది. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.