‘కూలీ’ సినిమాలో ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటిస్తున్నాడు అనే విషయం చాలా రోజుల క్రితమే.. ఇంకా చెప్పాలంటే చాలా నెలల క్రితమే తెలిసిపోయింది. అయితే సినిమా టీమ్ అఫీషియల్‌గా అయితే విషయం చెప్పలేదు. ఇప్పుడు ఎట్టకేలకు అఫీషియల్‌గా ఆమిర్ ఖాన్ అలియాస్ దాహాను ప్రేక్షకులకు చూపించారు. దీంతో ఆ పాత్రకు ‘విక్రమ్’ సినిమాలోని రోలెక్స్ పాత్రకు పోలికలు మొదలయ్యాయి. దాహా మరో రోలెక్స్ అవుతాడా అంటూ చర్చలు మొదలయ్యాయి. ముందు దాహా సంగతి చూసి.. తర్వాత మిగతా మాటలు మాట్లాడుకుందాం.
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా ప్రచారం స్టార్ట్ అవ్వలేదేంటి అనే చర్చ గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఆగస్టు 14కే రానున్న మరో సినిమా ‘వార్ 2’ ప్రచారం జోరు పెంచుతున్నారు.. ‘కూలీ’ కామ్‌గా ఉన్నాడేంటి అంటున్నారు. ఈ మాట టీమ్ వరకు వెళ్లిందేమో ‘దాహా’ రూపాన్ని రిలీజ్ చేశారు. దీంతో ఆమిర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.
ఈ పోస్టర్‌లో ఆమిర్ ఖాన్ సిగార్ పైప్ పీలుస్తూ స్టైల్‌గా నిలబడి ఉన్నాడు. రజనీ – ఆమిర్ చివరిగా 29 ఏళ్ల క్రితం ‘ఆతంక్ హై ఆతంక్’ సినిమాలో కలసి కనిపించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాతో మళ్లీ కలుస్తున్నారు. ఇక రోలెక్స్ విషయానికొస్తే.. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలో సూర్యని రోలెక్స్‌గా చూపించి ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడు ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ పాత్ర అలాగే ఉంటుందా? అనేదే ఇక్కడ చర్చ. మరి లోకేశ్ మనసులో ఏముందో?
ఇక లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ సినిమా పార్ట్ కాదని చాలా రోజుల క్రితమే చెప్పారు. అయితే అదంతా నిజం కాదని, సినిమా క్లైమాక్స్‌లో తన సినిమా విశ్వానికి ఈ సినిమాను యాడ్ చేసేలా లోకేశ్ ప్లాన్ చేస్తున్నారని కోడంబాక్కం వర్గాల సమాచారం. అదేంటో తెలియాలంటే పైన చెప్పిన ఆగస్టు 14 రావాల్సిందే. థియేటర్లలో రజనీకాంత్ కూలీ నెంబర్ 1421 అలియాస్ దేవాగా సందడి చేయనున్నారు.