టాలీవుడ్ లో మెగాహీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా వారి సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుంటుంది. ముఖ్యంగా నార్త్ లో ప్రభాస్ కాకుండా టాలీవుడ్ నుంచి అంత క్రేజ్ చూపిస్తున్నది మెగా హీరోలనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాల ద్వారా వీరికి అక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో తెలుగులో తెరకెక్కే సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేసుకోవడానికి హిందీ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి.
ప్రభాస్ సినిమాల మార్కెట్ ను పక్కన పెట్టేస్తే తెలుగు నుంచి హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా అత్యధిక ధరలు రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే టాప్ లో మెగా హీరోల సినిమాలే కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులకు రెండేళ్ల క్రితం రూ.22 కోట్ల రేటు వచ్చింది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రూ.23 కోట్లు పలికాయి.
అయితే కొన్ని రోజుల్లో ఈ రికార్డ్స్ ను మెగాస్టార్ చిరంజీవి బద్దలు కొట్టబోతున్నారు. ఆయన నటిస్తోన్న ‘ఆచార్య’ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఏకంగా రూ.26 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలో హిందీలో మంచి క్రేజ్ వచ్చింది. అందుకే డబ్బింగ్ హక్కుల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. త్వరలోనే ‘ఆచార్య’ హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్ ను క్లోజ్ చేయనున్నారు.