వరదల్ని ఎదుర్కొని మరీ బ్లాక్‌బస్టర్ అయిన సినిమా రా ఇదీ.. అని మొత్తం టాలీవుడ్ గొప్పగా చెప్పుకునే సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari). చిరంజీవి (Chiranjeevi) – శ్రీదేవి (Sridevi) – రాఘవేంద్రరావు (Raghavendra Rao) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా 1990లో మే 9న వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఉపోద్ఘాతం ఎందుకు అంటే.. ఎన్నో ఏళ్లు రీరిలీజ్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి, శ్రీదేవి, రాఘవేంద్రరావు అభిమానులకు.. తెలుగు సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చింది కాబట్టి.
ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా రీరిలీజ్ చేయమని కోరుతున్నవారిని ఇన్ని రోజులకు ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ హ్యాపీ చేసింది. హ్యాపీ అని కాదు డబుల్ హ్యాపీ చేసింది చెప్పాలి. టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన రోజుల నుండి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాను రీరిలీజ్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఎట్టకేలకు ఆ సినిమా రిలీజ్ డేట్ అయిన మే9నే రీరిలీజ్ డేట్‌గా ఎంపిక చేశారు.
అంతేకాదు సినిమాను నవీకరించి, త్రీడీ కూడా యాడ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అంటే మే 9న రాజు, ఇంద్రజను మరింత దగ్గరగా చూసి మురిసిపోవచ్చన్నమాట. త్వరలోనే సినిమా టికెట్ బుకింగ్‌లు స్టార్ట్ చేస్తారట. ఇదంతా ఓకే కానీ.. ఆ వరదల సంగతేంటి అనేదేగా మీ నెక్స్ట్‌ప్రశ్న. ముప్పై 1990 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో వరదలు పెద్ద ఎత్తున ముంచెత్తాయి. దీంతో ఊళ్లకు ఊళ్లు మునిగి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆ సమయంలోనే ఈ సినిమాను ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే విడుదల చేయాల్సి వచ్చింది. థియేటర్లకు జనాలు వస్తారా రారా అని నిర్మాతలు భయపడుతూనే రిలీజ్‌చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఆ రోజుల్లో సినిమా హాళ్లల్లో మోకాలు లోతు నీరు చేరిపోయినా కాళ్లు పైకి ముడుచుకొని మరీ ఆ సినిమా చూశారు. టాలీవుడ్‌లో ఓ పాత సినిమాను ఇలా త్రీడీలోకి మార్చి విడుదల చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.