‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన అందరినీ కదిలించింది. ఈ ఘటనలో రేణుక అనే మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలోకి చేరింది. దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసేందుకు ముందుకొచ్చారు.
Allu Arjun
ఆ సంఘటనను తలుచుకుంటూ అల్లు అర్జున్ వీడియోలో మాట్లాడుతూ, “ఈ ఘటన ఎంతో దురదృష్టకరం. తల్లిని కోల్పోయిన కుటుంబం తాలూకు బాధను మాటల్లో వర్ణించలేము. చాలాసార్లు అభిమానులతో కలిసి సినిమా చూడడం జరిగింది. కానీ ఇలా ఎన్నడూ జరగలేదు. ఈ దురదృష్టకర సంఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. వారి కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించబోతున్నాం.
అలాగే గాయపడిన బాలుడి వైద్యం కోసం కావలసిన అన్ని సహాయాలను అందిస్తాం” అని చెప్పారు. ఈ విషయంలో బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, “తల్లి కోల్పోవడం ఏ కుటుంబానికైనా అంతులేని దుఃఖం. వారి బాధను తగ్గించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను” అని తెలిపారు. గాయపడిన చిన్నారికి వైద్యం కోసం ‘పుష్ప 2’ టీమ్ పూర్తి ఖర్చు భరిస్తుందని ప్రకటించిన బన్నీ, ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని అన్నారు.
ఆయన మాట్లాడుతూ, “సినిమా చూసేందుకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడి సురక్షితమైన అనుభవం మా బాధ్యత. కానీ ఇలాంటి ఘటనలు ఎవరినైనా బాధిస్తాయి. ఆ కుటుంబానికి నా వ్యక్తిగత సాయం ఎల్లప్పుడూ ఉంటుంది” అని అన్నారు. ఇక ఈ సంఘటన నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ టీమ్‌పై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసింది. అలాగే షోల నిర్వహణకు గట్టి నియంత్రణలు ఉంటాయి అని మంత్రి వెల్లడించారు.