పుష్ప 2 (Pushpa 2) పూర్తయ్యాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) త్రివిక్రమ్ తో (Trivikram) వెంటనే ఓ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ హఠాత్తుగా అట్లీ (Atlee Kumar) రాకతో ప్లాన్ మారింది. AA22 సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ పట్టేశాడు. బన్నీ కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. విడుదలైన ఎనౌన్స్ మెంట్ వీడియోకు రికార్డు స్థాయి రెస్పాన్స్ రావడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, మాఫియా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో మాస్ కమర్షియల్ ఫార్మాట్‌లో రూపొందనుంది. హాలీవుడ్ స్టైలిష్ ట్రీట్‌మెంట్, అట్లీ మాస్ టేకింగ్, బన్నీ ఎనర్జీ అన్నీ కలసి ఒక భారీ విజువల్ ఫీస్ట్‌ను అందించబోతున్నాయి. అట్లీ ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్‌లకు బ్లూప్రింట్లు సిద్ధం చేయగా, బన్నీ గెటప్, బాడీ లాంగ్వేజ్ మొత్తం కొత్తగా ఉండనుంది.
తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తున్న అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాను 2026 డిసెంబర్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ ఏడాది జూన్ మధ్య నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. భారీ స్థాయి సెట్స్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్లతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు రెగ్యులర్ షూట్ మొదలైతే, టైం ఫ్రేమ్ ప్రకారం రిలీజ్ డేట్ చేరువవ్వడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
ఈ సినిమాలో బన్నీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీలు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. సంగీతం, విజువల్స్, కథ అన్నిటిలోనూ కొత్తగా చూపించేందుకు బన్నీ అండ్ అట్లీ జట్టు శతవిధాలా కసరత్తు చేస్తోంది. ఇక 2026 సెప్టెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలన్నది అట్లీ ప్లాన్. మరి ప్లాన్ కు తగ్గట్టుగా సినిమా సిద్ధమవుతుందో లేదో చూడాలి.