అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రం 2015లో విడుదలయ్యింది. కాకతీయుల కాలం నాటి ఈ కథలో గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పాలి. బందిపోటుగా నటించి చివరికి రుద్రమదేవికి సాయం చేసే వ్యక్తిగా గోన గన్నారెడ్డి పాత్ర కనిపిస్తుంది. అయితే ఈ పాత్రకు బన్నీ వందకు వంద శాతం న్యాయం చేసాడనే చెప్పాలి. ‘నేను తెలుగు భాష లెక్క … ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ మాస్ ఆడియెన్స్ చేత విజిల్స్ కొట్టించిందనే చెప్పాలి.
ఇక ‘రుద్రమదేవి’ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించకపోయినా.. గోన గన్నారెడ్డి క్యారెక్టర్ వల్లే కాస్త ఆడిందనేది అందరికీ తెలిసిన విషయమే..! అయితే ఈ పాత్రకు ముందుగా దర్శకుడు గుణశేఖర్.. అల్లు అర్జున్ ను అనుకోలేదట. ఇద్దరు స్టార్ హీరోలను దాటుకుని ఆ పాత్ర బన్నీ వరకూ వచ్చిందట. అవును గోన గన్నారెడ్డి.. పాత్రకు మొదట అనుకున్నది మహేష్ బాబునే అట. కానీ మహేష్ కు డేట్స్ ఖాళీ లేక ఈ పాత్ర చెయ్యలేను అని చెప్పాడట. మహేష్ ఈ పాత్రను రిజెక్ట్ చెయ్యడంతో.. ఎన్టీఆర్ ను సంప్రదించాడట గుణశేఖర్.
నిజానికి ‘ఒక్కడు’ తరువాత గుణశేఖర్… ఎన్టీఆర్ తో ఓ సినిమా చెయ్యాలని అనుకున్నాడట. గతంలో ఎన్టీఆర్ తో దర్శకుడు గుణశేఖర్ ‘బాల రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ హీరో అయ్యాక సినిమా చేద్దాం అనుకుంటే.. కథ సెట్ అవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ను గోనగన్నా రెడ్డి పాత్రకు తీసుకోవాలని గుణశేఖర్ అనుకున్నా..కూడా ఎన్టీఆర్ కు కాల్ షీట్లు ఖాళీ లేకపోవడంతో ఆ పాత్ర చెయ్యలేకపోయాడట. దీంతో అల్లు అర్జున్ ను సంప్రదించి ఓకే చేయించుకున్నాడట గుణశేఖర్.