వెంకటేష్ హీరోగా కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మీనా, అపర్ణ హీరోయిన్లుగా నటించిన సుందరకాండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో భాగ్యరాజా నటించి బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ‘సుందరకాండ’ రీమేక్ కావడం గమనార్హం. టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన కె.వి.వి సత్యనారాయణ తమిళంలో ‘సుందరకాండ’ హిట్ కావడంతో తెలుగులో ఈ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని భావించి డబ్బింగ్ హక్కులు కొన్నారు.
డబ్బింగ్ పనులు జరుగుతున్న సమయంలో హీరో వెంకటేష్ సినిమాను చూసి తెలుగులో ఆ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు. అయితే అప్పటికే నిర్మాత సత్యనారాయణ అన్ని ఏరియాల హక్కులను అమ్మేశారు. వెంకటేష్ సినిమాలో నటిస్తానని చెప్పడంతో బయ్యర్లకు రెట్టింపు డబ్బులు ఇప్పించి నిర్మాత సత్యనారాయణ తమిళ సుందరకాండ డబ్బింగ్ వెర్షన్ విడుదల కాకుండా ఒప్పించారు. అయితే నిర్మాత సత్యనారాయణ కేవలం డబ్బింగ్ హక్కులు మాత్రమే తీసుకోవడంతో మరో సమస్య ఎదురైంది.
అగ్రిమెంట్ లో ఎక్కడా రీమేక్ అనే పదం వాడకపోవడంతో నిర్మాత సత్యనారాయణ భాగ్యరాజాకు మరో రూ.25 లక్షలు చెల్లించి రీమేక్ హక్కులు తీసుకున్నారు. అలా రిలీజ్ కు ముందే సుందరకాండ తెలుగు వెర్షన్ కోసం 45 లక్షల రూపాయలు ఖర్చైంది. అయితే తెలుగులో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కె.వి.వి.సత్యనారాయణకు బాగానే లాభాలు వచ్చాయి. బొబ్బిలిరాజా, చంటి విజయాలతో జోరుమీదున్న వెంకటేష్ ఖాతాలో సుందరకాండ సినిమాతో మరో హిట్ చేరింది.