దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన మహిస్మతి రాజ్యం, అందులో యుద్ధాలను చూసినప్పుడు తెలుగు వారే కాదు, ప్రపంచ సినీ జనులందరూ ఔరా అన్నారు. బాహుబలిలోని అద్భుత పోరాట సన్నివేశాలను నోరెళ్ళబెట్టి చూస్తుండి పోయారు. బాహుబలి, భల్లాల దేవ, కట్టప్ప ఆయుధ విన్యాసాలను కనురెప్ప వేయకుండా తిలకించారు.
ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి 2 లోనూ భారీ యాక్షన్ సీన్లు ఉంటాయని భల్లాల దేవ పాత్ర దారి అయిన రానా దగ్గుబాటి వెల్లడించారు. బిగినింగ్ లో ఉన్న దానికి మించి కంక్లూజన్ లో పోరాటాలు ఉంటాయని వివరించారు. క్లైమాక్స్ ఫైట్ అయితే సినిమా మొత్తంలో హైలెట్ గా నిలుస్తుందని చెప్పారు. కేవలం ఈ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి 30 కోట్లు ఖర్చు పెట్టారు. వంద రోజుల పాటు షూటింగ్ చేశారు.
దీనికి గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ జోడించడానికి మూడు నెలల సమయం కేటాయించారు. ఎన్నో ప్రత్యేకతలతో విజువల్ వండర్ గా నిలువనున్న ఈ సినిమా ఏప్రిల్ 28, 2017 న రిలీజ్ కానుంది.