ప్రముఖ నిర్మాత బోనీకపూర్ నుంచి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఆయన క్రెడిట్ కార్డ్ ద్వారా లక్షలు దోచుకున్నారు. ఈ విషయంపై బోనీకపూర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అంబోలీ పీఎస్ పోలీసులు వెల్లడించారు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు వివరాలు, పాస్‌వర్డ్ తదితర డేటాను నిందితులు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ డేటా సహాయంతో ఫిబ్రవరి 9న ఐదుసార్లు డబ్బుని ఆన్‌లైన్ ట్రాన్స్ఫర్ చేశారు.
ఈ ఐదు ట్రాన్సాక్షన్స్‌లతో మొత్తం రూ. 3.82 లక్షలను నిందితులు దోచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లావాదేవీలు జరిగినట్లు బోనీకపూర్ కి తెలియదని.. తరువాత అకౌంట్స్ చెక్ చేసినప్పుడు తాను డబ్బు పోగొట్టుకున్నట్లు గ్రహించానని పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్ లోకి వెళ్లినట్లు ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్నారు పోలీసులు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.
ఈ మధ్యకాలంలో ఇలాంటి సైబర్ నేరాలు చాలా కామన్ అయిపోయాయి. సెలబ్రిటీలే కాకుండా సామాన్య ప్రజలు కూడా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాలకు అరికట్టడానికి పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పెరిగిన టెక్నాలజీని తమకు అనుగుణంగా వాడుకుంటున్నారు నేరగాళ్లు. ఒక్కసారి సైబర్ క్రైమ్ లో డబ్బు పోగొట్టుకుంటే తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువ. బోనీకపూర్ డబ్బు కూడా పోయినట్లే చెప్పుకోవాలి!