కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి సమయంలో బాణాసంచా కాల్చినందుకు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వస్తే.. గురువారం నాడు అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే ఆయనికి శుభాకాంక్షలు చెప్పడానికి బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68లోకి ఆయన నివాసానికి వందలమంది అభిమానులు తరలివచ్చారు.
ఎలాంటి అనుమతులు లేకుండానే గంటపాటు బాణాసంచా కాల్చడంతో చుట్టుపక్కల వారికి తీవ్ర అసౌకర్యం కలిగింది. దీంతో చాలా మంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. పెట్రోకార్ కానిస్టేబుల్ విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్ ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్, మరో అభిమాని సంతోష్ పై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు.
గురువారం ఉదయం వివిధ ప్రాంతాల నుండి అభిమానులు అల్లు అర్జున్ ఇంటికి తరలి రావడంతో రోడ్లన్నీ కిటకిటలాడాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.