గత కొంత కాలంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా గ్రాండ్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమలేమి రాలేదు. కొందరి స్టార్ హీరోల సినిమాలు ఊహించిన రీతిలో వసూళ్లు సాధించలేకపోతున్నాయి. అయితే విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన చావా (Chhaava) ఈ నెగటివ్ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీ మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ సాధించడంతో పాటు, వారాంతంలో సాలిడ్ వసూళ్లు రాబట్టింది.
ఈ చిత్రంలో (Chhaava) విక్కీ కౌశల్ పవర్‌ఫుల్ లుక్, రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫీమేల్ లీడ్ రోల్, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహారాష్ట్రలో శివాజీ వంశానికి ఉన్న విశేషమైన అభిమాన బలం సినిమాకు ప్లస్ అవ్వడంతో, అక్కడ ఊహించని స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. ఇక వీకెండ్ లో ఆదివారం వరకు కలెక్షన్లు భారీగా పెరిగి ఓవర్‌సీస్ సహా టోటల్ 106 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం కూడా మంచి నెంబర్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లెక్క 120 కోట్లకు చేరినట్లు టాక్.
ముఖ్యంగా ముంబయి, పూణే ప్రాంతాల్లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. శివాజీ మహారాజ్ వారసుడి కథ కావడం వల్ల, ఈ ప్రాంతంలో చావా సినిమాకు ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే, ఉత్తర భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఓపెనింగ్స్ స్టడీగానే ఉన్నప్పటికీ, మహారాష్ట్ర స్థాయిలో ఆకర్షించలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ సినిమా రన్‌ను కంటిన్యూ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
హైదరాబాద్ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ సినిమా కాన్సెప్ట్‌ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. దీంతో రెండో వారాంతానికి 150 కోట్ల క్లబ్ చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం బుకింగ్స్ బాగానే ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద బాలీవుడ్‌కు మళ్లీ హిస్టారికల్ మూవీ బాక్సాఫీస్ హవా చూపించబోతుందనే సూచనలు కనిపిస్తున్నాయి.