టాలీవుడ్ నిర్మాతలు ఓ సంచలనాత్మక నిర్ణయానికి తెరలేపనున్నారా? నేరుగా డిజిటల్ మాధ్యమాలలో తమ చిత్రాలను విడుదల చేయనున్నారా? అంటే… అవుననే మాట గట్టిగా వినిపిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రప్రంచలో ఉన్న అన్ని పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ తీసింది. అలాగే చిత్ర పరిశ్రమలు కూడా కుదేలవ్వుతున్నాయి. కొత్త చిత్రాల సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడంతో పాటు ఇప్పటికే పూర్తయిన సినిమాల విడుదల ఆగిపోయింది. దేశములోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా థియేటర్స్, మాల్స్ మూతపడ్డాయి.
కరోనా భయంతో ప్రజలు అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఈ పరిణామాలతో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్స్ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోతే నిర్మాతలకు వడ్డీల రూపంలో పెట్టుబడి వ్యయం పెరిగిపోతుంది. అంతకంతకూ కరోనా ప్రభావము పెరుగుతూ పోతుంది. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. దీనితో టాలీవుడ్ నిర్మాతలు సంచలనం నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. వారు తమ చిత్రాలను నేరుగా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ ద్వారా విడుదల చేయనుకుంటున్నారట.
మరో రెండు మూడు నెలల వరకు థియేటర్స్ తెరిచే సూచనలు కనిపించడం లేదు. అందుకే నేరుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా తమ చిత్రాలు విడుదల చేయాలని అనుకుంటున్నారట. టాలీవుడ్ లో వి, అరణ్య, నిశ్శబ్దం, ఉప్పెన, 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఇలా అనేక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్, హాట్ స్టార్ , ఆహా వంటి స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉంది.