తెలుగోళ్లు సినిమా పిచ్చోళ్లబ్బా.. సినిమా బాగుంటే చాలు అది ఏ భాష అయినా పట్టించుకోరు. అర్ధరాత్రి అయినా వెళ్లిపోతారు, రీరిలీజైనా చూసేస్తారు. అందులో నటించిన పాత్రధారులు అందరూ మనకు తెలియకపోయినా ఆదరించేస్తారు. అయితే ఇదే ప్రేమ మన హీరోలకు, మన సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో దొరుకుతుందా? అసలు ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఇలాంటిది చూశామా? అని అడిగితే రకరకాల ఆన్సర్లు వస్తాయి. అయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ రాబోతోంది. అది కూడా ఒక్క రోజులోనే.
Devara
ఎందుకంటే తారక్ (Jr NTR) – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ (Devara) సినిమా తొలి పార్టు ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నా.. ఇతర రాష్ట్రాల్లో అంతగా లేదు అని అంటున్నారు. ముఖ్యంగా హిందీ, తమిళంలో ఆశించిన మేర టికెట్లు తెగలేదు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళం నుండి వచ్చే ఓ మోస్తరు స్థాయి సినిమాను కూడా బాగా ఆదరించే మనం ఒకవైపు..
పాన్ ఇండియయా స్థాయిలో రూపొంది సరైన ఆదరణ అందుకోని ఇతర ఇండస్ట్రీలు మరోవైపు అనేలా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలో విజయ్ (Thalapathy Vijay) ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (ది గోట్) (The Greatest of All Time) తెలుగులో ఎంత పెద్ద రిలీజ్ దక్కిందో గుర్తు చేస్తున్నారు. అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు కూడా ఆ సినిమాలు షోలు పడ్డాయి. మనవాళ్లు వెళ్లారు కూడా. కానీ మన సినిమాకు ఎందుకు అంతటి ఆదరణ దక్కడం లేదు.
సమస్య చూసేవాళ్లలో ఉందా? లేక సినిమాలో ఉందా? అనేది తెలియడం లేదు. ఈ విషయంలో ‘దేవర’ రిలీజ్‌తో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. సినిమా బాగుండీ చూడకపోతే అక్కడే సమస్య అని తేల్చేయొచ్చు. ఆ విషయం పక్కన పెడితే.. సినిమాకు ముంబయి, బెంగళూరు, దిల్లీ, చెన్నై తదితర ప్రాంతాల్లో ఆశించిన మేర అడ్వాన్స్ బుకింగ్స్ లేవు అంటూ సోషల్ మీడియాలో కొన్ని అంశాలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు అని టీమ్ చెబుతోంది.