రామ్‌చరణ్ కెరీర్‌లో బెస్ట్ మూవీస్ లిస్ట్ తప్పక ఉండే సినిమా ‘ధృవ’. అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త రామ్‌చరణ్ కనిపించాడు ఆ సినిమాతో. అందుకే ఆ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుంది అని చాలా రోజుల నుండి అభిమానులు కోరుకుంటున్నారు. వారి మాట విన్నాడో, లేక తనకే చేయాలి అనిపించిందో కానీ.. రామ్‌చరణ్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడట. దీని గురించి మాతృక దర్శకుడు మోహన్‌రాజాతో గతంలో కొన్ని చర్చలు కూడా సాగాయట.
‘గాడ్‌ఫాదర్’ పనులు అయిపోవడంతో ఆ సినిమా ముందుకు వస్తుంది అని అంటున్నారు. అయితే ఇక్కడే ఓ విషయం అర్థం కావడం లేదు. ‘ధృవ’ మాతృక అయిన ‘తనిఒరువన్’ను తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కించారు. దీంతో సీక్వెల్ చేస్తే ఇక్కడా, అక్కడా వేర్వేరు హీరోలతో చేస్తారా? లేక ఒకే హీరోతో చేస్తారా అనేది తెలియడం లేదు. ఒకవేళ ఎట్ ఏ టైమ్ రెండు భాషల్లో ఇద్దరు హీరోలతో సినిమా చేయాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు.
కేవలం లీడ్ యాక్టర్‌ను మార్చి మిగిలిన అందరినీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టి చేస్తే నేటివిటీ మిస్ అవుతుంది. దీంతో ‘ధృవ 2’ ,‘తని ఒరువన్ 2’ లో ఏదో ఒకటి ముందు స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ రామ్‌చరణ్ కానీ, అక్కడ జయం రవి కానీ ఖాళీగా లేరు. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ పనుల్లో జయం రవి తీరిక లేకుండా ఉన్నారు. ఇక రామ్‌చరణ్ అయితే శంకర్ సినిమా చేయాలి. ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ సినిమా ఉంటుంది.
కాబట్టి.. ఏది ముందు అనేది తెలియాలి. ఒకవేళ ‘ధృవ 2’ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు మోహన్‌రాజా తన తర్వాతి సినిమా నాగార్జున – అఖిల్‌తో ఉంటుందని ఇటీవల ప్రకటించారు. ఈ లెక్కన ఈ మూడింటిలో ఏది ముందు మొదలవుతుంది. అసలు మూడు సినిమాలుగా ఉంటుందా పరిస్థితి, లేక రెండు సినిమాలుగా ఉంటాయా అనేది మోహన్ రాజానే చెప్పాలి.