2021 సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన సినిమాలలో అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద 260 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాయి. అఖండ 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా పుష్ప ది రైజ్ 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో శ్యామ్ సింగరాయ్ 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.
ఈ మూడు సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడవడంతో నిర్మాతలకు చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలు మిగిలాయి. అయితే పుష్ప సినిమాలోని బావి సీన్, శ్యామ్ సింగరాయ్ సినిమాలోని బావి సీన్ బడ్జెట్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. పుష్ప మూవీలో ఎర్ర చందనంతో ఉన్న లారీని బన్నీ బావిలోకి నెట్టేసే సీన్ కొరకు నిర్మాతలు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అల్లు అర్జున్ హీరో కావడం సుకుమార్ రంగస్థలం తర్వాత తెరకెక్కించిన సినిమా కావడంతో నిర్మాతలు ఊహించని స్థాయిలో డబ్బు ఖర్చు చేశారు.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరో నాని బావిలోకి దళితుడిని తోసేస్తాడు. ఈ సీన్ కోసం ఖర్చు చేసిన మొత్తం కేవలం 20,000 రూపాయలు కావడం గమనార్హం. బన్నీ స్థాయికి నిర్మాతలు సీన్ కోసం రెండు కోట్లు ఖర్చు చేస్తే నాని సినిమా సీన్ ను మాత్రం తక్కువ ఖర్చుతో తెరకెక్కించారు. శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం బావిని ఆర్ట్ వర్క్ తో సీజీ కలిపి క్రియేట్ చేశారని సమాచారం.
ఈ బావి కాన్సెప్ట్ వల్ల ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ రెండు సినిమాల గురించి చర్చ జరుగుతోంది. మరోవైపు బన్నీ, నాని తమ తరువాత సినిమాలతో బిజీ అవుతున్నారు. బన్నీ ఈ సంవత్సరం పుష్ప ది రూల్ ను విడుదల చేస్తుండగా నాని నటిస్తున్న రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి.