కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అనిపిస్తాయి. అలాంటి వాటిలో శ్రీకాంత్ – ఎస్వీ కృష్ణారెడ్డి ల కాంబినేషన్ ఒకటి. ఈ కాంబినేషన్లో మొత్తం 6 సినిమాలు వచ్చాయి. అవే ‘వినోదం’ ‘ఊయల’ ‘ఎగిరే పావురమా’ ‘మనసులో మాట’ ‘పెళ్ళాం ఊరెళితే’ ‘సరదా సరదాగా’. ఇందులో ‘ఊయల’ ‘సరదా సరదాగా’ తప్ప మిగిలిన అన్ని సినిమాలు హిట్లే..! అయితే ఎస్వీ కృష్ణారెడ్డి పనైపోతుంది అనుకున్న టైంలో శ్రీకాంత్ తో ‘పెళ్ళాం ఊరెళితే’ అనే సినిమా తీశారు.
ఇందులో తొట్టెంపూడి వేణు కూడా ఓ హీరోగా నటించాడు. 2002 లో ప్రభు, ప్రభుదేవా లు హీరోలుగా వచ్చిన ‘చార్లీ చాప్లిన్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఎస్వీ కృష్ణారెడ్డి. 2003 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఓ పక్క ఎన్టీఆర్ ‘నాగ’.. మరోపక్క మహేష్ బాబు ‘ఒక్కడు’ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమా ఘనవిజయం సాధించింది. ‘సిరి మీడియా ఆర్ట్స్’ బ్యానర్ పై అశ్వినీ దత్, అల్లు అరవింద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాలో కథేమీ ఉండదు. అనుమానపు భార్యకి.. ఆమె భర్త ఓ అబద్ధం చెబుతాడు. దాని వల్ల బోలెడన్ని అబద్దాలు ఆడాల్సి వస్తుంది.ఫలితంగా తనతో పాటు తన స్నేహితుల కాపురాలు కూడా కూలిపోయే స్టేజికి వెళ్లిపోతాయి. అయినప్పటికీ ఈ సినిమాలో కామెడీ బాగా పండడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే అదే హీరో (శ్రీకాంత్) అదే దర్శకుడు(ఎస్వీ కృష్ణారెడ్డి) కలిసి మళ్ళీ అదే కథతో ఇంకో సినిమా చేశారు. అదే ‘సరదాగా సరదాగా’.
ఇది కూడా ‘పెళ్ళాం ఊరెళితే’ కథే.. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకి జిరాక్స్ లా ఉంటుంది. అబద్దం చుట్టూనే ఈ సినిమా కథ కూడా నడుస్తుంది. ఆ అబద్ధం రెండు జంటల కాపురంలో నిప్పులు పోస్తుంది. ఈ సినిమాలో కూడా కామెడీ ఉంది. కానీ అది జనాలను ఆకట్టుకోలేదు. అందుకే ఈ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా ప్రేక్షకులకు తెలీదు. కానీ ఓ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుండి మళ్ళీ మళ్ళీ ఒకే కథను జనాలు కోరుకోరు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది.