వరుస విజయాలతో జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇప్పుడు ‘అఖండ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల కుంభమేళాలో కూడా సినిమా చిత్రీకరణ నిర్వహించారు. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సినిమా టీమ్ వాడుకొని సినిమాను రిచ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సినిమా కాస్టింగ్ విషయంలో కూడా రిచ్‌నెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) . ఈ క్రమంలో సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకున్నారట.
బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ’ సినిమా ఏ స్థాయి విజయం అందుకుందో మీ అందరికీ తెలిసిందే. దేవుడు, మానవాతీత శక్తులు, మాస్ ఎలిమెంట్స్ ఇలా సినిమా అదిరిపోయింది. ఇప్పుడు అదే ఊపులో ‘అఖండ 2 – తాండవం’ చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) , సంయుక్తను (Samyuktha Menon) తీసుకున్న చిత్రబృందం.. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్‌ను తీసుకొస్తున్నారు. దిల్లీకి చెందిన రాజకీయ నాయకురాలిగా ఆమె కనిపిస్తారట.
విద్యా బాలన్ (Vidya Balan).. బాలయ్యకు, ఆయన ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. గతంలో ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ ( NTR: Kathanayakudu), ‘యన్.టి.ఆర్: మహా నాయకుడు’ (NTR: Mahanayakudu) సినిమాల్లో విద్యా బాలన్ నటించింది. ఎన్టీఆర్ సతీమని బసవతారకంగా ఆమె ఆ సినిమాల్లో కనిపించారు. అయితే ఆ రెండు సినిమాలూ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలసి నటిస్తుండటంతో ఫలితం ఎలా ఉంటుంది అనే ఆసక్తి రేకెత్తుతోంది.
ఇక ‘అఖండ 2: తాండవం’ సినిమా గురించి చూస్తే.. రామ్ ఆచంట (Ram Achanta) , గోపీ ఆచంట (Gopichand Achanta) నిర్మిస్తున్నారు. థమన్ (S.S.Thaman) సంగీతం అందిస్తున్నారు. ఎప్పట్లాగే ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తాడట. ఒకటి సగటు మనిషి పాత్ర అయితే.. రెండోది అఘోర అని అంటున్నారు. ఆ పాత్ర ఎంట్రీ గురించి కూడా ఓ పుకారు వినిపిస్తోంది. హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ బాలకృష్ణ పాత్ర రివీల్ అవుతుందని సమాచారం.