పౌరాణిక, జానపద, సాంఘిక పాత్ర ఏదైనా చరిత్ర సృష్టించే అభినయ సింహ. ఆయన మాట ముక్కుసూటిగా ఉంటుంది. మనసు పసిపాపలాంటింది. పేద ప్రజలందరూ బాలయ్యకు కుటుంబసభ్యులే. సినిమాల్లో బిజీగా ఉన్నా ఎంఎల్ఏ గా గెలిచి వారికోసం పాటు పడుతున్నారు. పదవిలో ఉన్నా, లేకున్నా అయన ఎప్పుడూ ప్రజల సేవలోనే ఉంటారు. తెలుగువారందరి చేత అన్నా అని పిలుపించుకున్న మహానటుడు నందమూరి తారక రామారావు నట వారసుడు బాలయ్య.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు దర్శకత్వంలో బాలకృష్ణ తొలిసారి నటించారు. “తాతమ్మ కల” చిత్రం ద్వారా వెండితెరపైన కనిపించారు. నూనూగు మీసాలతో నటించి మెప్పించారు. రామ్ రహీం, అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దాన వీర శూర కర్ణ, తదితర పది సినిమాల్లో యువ బాలకృష్ణ కనిపించారు. తర్వాత సోలో హీరోగా డిస్కో కింగ్ లో మెరిసారు. తర్వాత మంగమ్మ గారి మనవడు తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు. అక్కడ నుంచి నందమూరి బాల కృష్ణ విజయ సోపానం ఊపందుకుంది. సీతారామ కళ్యాణం, ముద్దుల మామయ్య, మువ్వగోపాలుడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్ వందరోజులు ఆడింది. తండ్రి ఎన్టీఆర్ లాగా మాస్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీ కృష్ణార్జున విజయం, శ్రీ రామ రాజ్యం వంటి పౌరాణిక చిత్రాల్లోనూ నటనతో ఆకట్టుకున్నారు. జానపద సినిమా భైరవ ద్వీపం తో తనకు సరిలేరు ఎవ్వరూ అని నిరూపించుకున్నారు.
సింహా పేరుంటే హిట్టే..
బాలకృష్ణ సినిమా పేర్లలో సింహం ఎక్కువగా కనిపిస్తాయి. బొబ్బిలి సింహం, సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు, సీమ సింహం , లక్ష్మి నరసింహ, సింహ, లయన్.. వీటిలో ఒక్కటి తప్ప అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. బాలకృష్ణ ను పవర్ ఫుల్ పాత్రలో చూడడం అభిమానులకు ఇష్టం. అందుకే ఇవన్నీవిజయాలను సాధించాయి. నరసింహ నాయుడు, సింహ చిత్రాలలో నటనకు బాలయ్య నంది అవార్డ్ లు అందుకున్నారు.
రికార్డులు క్రియేట్ చేయనున్న వందో సినిమా
నటసింహా నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా గురించి తెలుస్తోన్న సంగతులు సినిమా అంచనాలను పెంచేస్తున్నాయి. మొరాకోలో జరిగిన మొదటి షెడ్యూల్ షూటింగ్లో హిందీ నటుడు కబీర్ బేడి పాల్గొన్నారు. జేమ్స్ బ్యాండ్ సినిమాలో విలన్ గా దడ పుట్టించిన నటుడిని తెలుగు సినిమాల్లో పరిచయం చేస్తుండడం, వెయ్యి మంది సైనుకులు, వంద గుర్రాలు, వంద ఒంటెలు చిత్రీకరణలో పాల్గొనడం .. ఇవన్నీ సినిమాకు భారీతనాన్నీ తీసుకొస్తున్నాయి. కెరీర్ తొలి నాళ్లలో బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి సినిమాలో కలిసి నటించింన శ్రియ గౌతమి పుత్ర శాతకర్ణిలో రాణిగా నటించనుంది. జాతీయ అవార్డ్ అందుకున్న డైరక్టర్ క్రిష్ ఈ సినిమాను అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఉండాలని శ్రమిస్తున్నారు.
కాలి ఫోర్నియాలో వేడుక
లెజెండ్ నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజును ఈసారి అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుపుకోనున్నారు. ఇందుకోసం బాలయ్య సోమవారం అమెరికాకు వెళ్లారు. అక్కడ అభిమానులు బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. అతని పుట్టిన రోజు వేడుకలో గౌతమి పుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. అంతే కాదు బాలకృష్ణ నటి హంసా నందిని తో స్టెప్పులు కూడా వేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా నిధులను సేకరించి క్యాన్సర్ బారిన పడిన పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించే ఉద్దేశంతో ఎన్టీఆర్ నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్”కు అంధ జేయనున్నారు. ఈ ఆస్పత్రీలొ సేవలను బాలకృష్ణ విస్తృత పరిచారు. చికిత్స చేసుకున్న వారికి ఉచితంగా భోజన వసతి కల్పించారు. అంతే కాకుండా .. జన్యుపరంగా వచ్చే క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి, పెదవి చీలిక) జబ్బుతో బాధపడే చిన్నారులకు బసవతారకం స్మైల్ ట్రైన్ సెంటర్(బీఎస్టీసీ) ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నారు.
నటన, సేవ రెండు కళ్ళుగా బతుకుతున్న బాలయ్య మరెన్నో విజయాలను అందుకోవాలని.. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలుగు హృదయాలు కోరుకుంట్టున్నాయి. నేడు బాలయ్య జన్మదినం (జూన్ 10). ఆయన ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.