‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటను చూశారా? ఇదేం మాట ఎన్నిసార్లు చూశారు అని అడగాలి కానీ.. చూశారా అని అడుగుతారేంటి అంటారా? ఓకే ఓకే.. అన్నిసార్లు చూశారు కదా.. ఆ పాటలో ఈ విషయాలు మీకు తెలుసా? లేదో చూసుకోండి. ఈ పాట ఆస్కార్ అవార్డు కోసం బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో పాటలో కొన్ని ఆసక్తికర అంశాలను, తనకు ఇష్టమైన విషయాలను చెప్పుకొచ్చారు.
* ‘నాటు నాటు..’ పాటను తొలుత మన దేశంలోనే షూట్ చేద్దాం అనుకున్నారు. అయితే వర్షాకాలం కావడంతో ఇబ్బందులు వస్తాయేమో అని.. ఉక్రెయిన్‌లోని ఓ భవనాన్ని చూసి ఓకే అనుకున్నారు. అంతా అది ప్రెసిడెన్సియల్ ప్యాలెస్ అని తెలిసి పర్మిషన్లు రావేమో అనుకున్నారట. కానీ వాళ్లు ఒప్పుకోవడంతో షూట్ చేశారు.
* ఈ పాటలో ఉక్రెయిన్ పార్లమెంట్ భవనం డోమ్ కూడా ఓ షాట్‌లో కనిపిస్తుంది. అలాగే పాటలో బ్యాగ్రౌండ్‌లో కనిపించే అమ్మాయిలు, మ్యూజీషియన్ల టీమ్ జూనియర్ ఆర్టిస్ట్‌లు కారట. నిజమైన డ్యాన్సర్లు, మ్యూజీషియన్సేనే తీసుకున్నారట.
* పాటలోని ఐకానిక్ స్టెప్ అయిన నాటు నాటు మూమెంట్ కోసం ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ 100కుపైగా స్టెప్స్ కంపోజ్ చేశారట. వాటిలోంచి ఒకటి తీసుకోవడం కష్టమైనా ఆఖరికి ఇప్పుడున్న దానిని తీసుకున్నామని రాజమౌళి చెప్పారు. పాట విజయానికి ఫస్ట్ క్రెడిట్ ప్రేమ్ రక్షిత్‌దే అని కూడా చెప్పారు రాజమౌళి.
* పాటలో ఓ సందర్భంలో తారక్, చరణ్ వేసుకున్న సస్పెండర్స్‌ను జెన్నీ వదులుతుంది. ఆ సమయంలో అవి బలంగా బాడీకి తాకడంతో నొప్పితో విలవిల్లాడారట. అయితే ఆ నొప్పిని షాట్‌లో కనిపించకుండా బాగా నటించారని రాజమౌళి చెప్పారు.
* సస్పెండర్స్ ఆడుతూ మూమెంట్స్ చేసేటప్పుడు వేసుకున్న సస్పెండర్స్, పాటలో మిగిలిన సమయంలో వేసుకున్న సస్పెండ్స్ ఒకటి కావట. ఆ స్టెప్పుల కోసం కాస్త వదులుగా ఉన్నవి డిజైన్ చేయించారట డిజైనర్ రమ.
* పాటలో ఒలీవియా మోరీస్ ‘వావ్’ అంటూ ఓ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఆ షాట్ ను మరీ మరీ చూపించండి, చూపించండి అని టీమ్ అంటా మానిటర్ దగ్గరకు వచ్చి చూశారట. ఆ షాట్ తన దృష్టిలో అదే బెస్ట్ అని చెప్పారు రాజమౌళి.