భారతీయ సంగీతానికి, అందులో దక్షిణ భారతదేశ సంగతానికి ప్రపంచ వేదిక మీద అరుదైన గుర్తింపు లభించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాటకు గాను ప్రతిష్ఠాత్మక గోల్డెన్స్ గ్లోబ్ పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని ఆ సినిమా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందుకున్నారు. మరి అంతటి ఘనత అందుకున్న ఈ పాట వెనుక ఏం జరిగింది, టీమ్ ఎంత కష్టపడింది అనేది తెలుసుకోవాలి కదా. గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రచారంలో భాగంగా టీమ్ చెప్పిన కొన్ని విషయాలు ఇవీ.
* ఎన్టీఆర్, రామ్‌చరణ్‌పై ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఓ మాస్ సాంగ్ తీయాలని అనుకుందట. సినిమాలోని పాటలన్నింటికీ భిన్నంగా ఉండాలని భావించారట. అలా ఈ పాట వచ్చింది.
* ఎం.ఎం.కీరవాణి అందించిన స్వరాలకు చంద్రబోస్ చక్కటి సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాట పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
* ‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. అప్పటికి ఆ ప్రాంతంలో యుద్ధ వాతారణం లేదు. అక్కడ పాట కోసం సాయం చేసినవాళ్లకు ‘ఆర్‌ఆర్ఆర్’ టీమ్ అవసరం మేరకు ఇప్పుడు సాయం చేస్తుండటం గమనార్హం.
* ఆ పాటలో కనిపించే భవనం నిజమైనదే. ఉక్రెయిన్ అధ్యక్షుడికి చెందిన భవమనమట అది. ఆ ప్యాలెస్ పక్కనే పార్లమెంట్ భవనమూ ఉంటుందట.
* ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒకప్పుడు యాక్టర్ కావడంతో… ‘ఆర్ఆర్‌ఆర్’ టీమ్ కోరిక మేరకు చిత్రీకరణకు అనుమతిచ్చారట.
* ‘నాటు నాటు..’ పాటలోని డబుల్ డ్యాన్స్ లాంటి హుక్ స్టెప్ కోసం 80కు పైగా వేరియేషన్ స్టెప్స్‌ను ప్రేమ్ రక్షిత్ సిద్ధం చేశారట. చివరకు భుజాలపై చేతులు వేసుకుని ఇద్దరూ ఒకే రకంగా కాళ్లు కదిపే స్టెప్ ఓకే చేశారు.
* పాట చిత్రీకరణ సమయంలో ఇద్దరు హీరోలు సింక్ అయ్యేలా స్టెప్ రావడానికి 18 టేక్‌లు తీసుకున్నారట. అయితే ఫస్ట్ టేక్‌ను ఆఖరికి ఓకే చేయడం గమనార్హం.