‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా వచ్చి మూడు రోజులు అయిపోతుంది కాబట్టి చెబుతున్నాం.. ఈ సినిమా ఆఖరులో ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్’ అంటూ ఓ పోస్టర్ పడుతుంది. అంటే ఈ సినిమా ఇక్కడితో ముగియలేదని, ఇంకా కొనసాగుతంది అని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin). సినిమా టీమ్ ప్రచారంలో ఎక్కడా చెప్పకపోయినా ‘కల్కి’ ఒక పార్ట్ సినిమా కాదు అని జనాలకు తెలుసు. అయితే ‘సినిమాటిక్ యూనివర్స్’ అంటూ షాకిచ్చారు నాగీ.
అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ ఎన్ని సినిమాల వరకు? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే మామూలుగా సినిమాటిక్ యూనివర్స్‌లకు ఒక లెక్కంటూ ఉండదు. కథ, ఉప కథలు అంటూ ముందుకు వెళ్తుంటుంది. ఈ లెక్కన ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ కూడా చాలా ఏళ్లు ఉంటుంది అని అనుకుంటారు అందరూ. అయితే నిర్మాత అశ్వనీదత్ (C. Aswani Dutt) మాటలు వింటుంటే మూడో పార్టు సంగతే తేలడం లేదు. రెండో పార్టు అయితే చాలావరకు షూటింగ్ పూర్తయింది అన్నారాయన.
సినిమా కథా చర్చల్లో ఉండగానే రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన వచ్చిందని చెప్పిన అశ్వనీదత్.. కమల్ హాసన్ (Kamal Haasan) సినిమాలో భాగం కాగానే రెండు భాగాల ఆలోచనను ఫైనల్ చేసేశాం అని చెప్పారాయన. రెండో పార్టు షూటింగ్ కొంత అయిందని, కీలక సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేయాల్సి ఉందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదంతా అవ్వడానికి ఏడాదిపైనే పట్టొచ్చు అని చెప్పి ఫ్యాన్స్‌ని కాస్త నిరాశపరిచారు.
అందుకే ‘కల్కి 2’ విడుదలపై ఎలాంటి తేదీ అనుకోలేదని చెప్పారు. అయితే వచ్చే ఏడాది ఇదే సమయానికి విడుదల చేసే ఆలోచన ఉందని చెప్పారయన. అంతేకాదు చాలామంది అంటున్న పార్ట్ 3 గురించి ఇంకా ఏ విషయమూ అనుకోలేదు అని నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. ఈ లెక్కన ‘కల్కి’ పార్ట్ 2 వచ్చాక దాని ఫలితం బట్టి మూడో పార్టు గురించి చర్చ ఉండొచ్చు అని అంటున్నారు.