థగ్‌లైఫ్ (Thug Life) లాంటి లైఫ్‌ను జీవిస్తున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన నుండి రాబోయే సినిమాకు ఆ పేరే పెట్టారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam). ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సుమారు మూడు దశాబ్దాల తర్వాత రానున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో సినిమాలోని తొలి పాట ‘జింగుచ్చా’ను ఇటీవల చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తన గురువు దివంగత ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ను కూడా గుర్తు చేసుకున్నారు
కమల్ హాసన్ – మణిరత్నం కలసి సుమారు 37 ఏళ్ల తర్వాత కలసి పని చేస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’. మణిరత్నం సినిమా అంటే భారీ తారాగణం ఎంత ఉంటుందో, మంచి ప్రేమకథ కూడా ఉంటుంది. కమల్ హాసన్ విషయంలోనూ దాదాపు ఇలానే ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ కలసి చేసిన సినిమాలో ప్రేమ లేదు అని కమల్ హాసన్ మాటలతో అర్థమైంది. ఎందుకంటే ఈ సినిమాలో తన పాత్రకు ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ఒక్కరూ ఐ లవ్ యు చెప్పలేదని కమల్ హాసనే చెప్పారు కాబట్టి. బదులుగా జోజూ జార్జ్ చెప్పారని సరదాగా మాట్లాడారు.
ఇక దర్శకుడు మణిరత్నం గురించి చెబుతూ.. ఆయన సమయపాలన పక్కాగా పాటిస్తారని, తెల్లవారుజామున 5.30 గంటలకే షూటింగ్ స్పాట్‌కి వచ్చేస్తారని తెలిపారు. ఈ విషయంలో ఆయనలో దివంగత దర్శకుడు బాలచందర్‌ను చూశానన్నారు. 37 ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో ‘నాయకన్’లో నటించానని, ఆయన అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారని, ఏమాత్రం మార్పు రాలేదని కమల్ చెప్పుకొచ్చారు. తామిద్దరం సినిమా కథ గురించి చర్చించుకునే సమయంలో 25 శాతం సినిమా అయిపోయినట్లే అని అన్నారు.
ఇక మణిరత్నం మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తర్వాత కమల్ హాసన్‌తో పని చేసే అవకాశం వచ్చింది. ఆయన గొప్ప నటుడని అందరికీ తెలిసిందే. నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని సినిమాలకు సరిహద్దులు ఉండవని కమల్ నిరూపించారు. షూటింగ్ సమయంలో ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం అని మణిరత్నం చెప్పారు.