కన్నడ చిత్రపరిశ్రమ నుండి విడుదలైన మరో చిత్రరాజం “కాంతార”. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ అనువాదరూపంలో విడుదల చేసింది. ఎందుకని కాంతార భాషతో సంబంధం లేకుండా ప్రతి సినీ అభిమానిని అలరించిందో చూద్దాం..!!
కథ: అసంఖ్యాకమైన సంపద, కుటుంబం, సంతానం అన్నీ ఉన్నా.. ఏదో తెలియని లోటుతో మదనపడే ఓ రాజు, ప్రశాంతతను వెతుక్కుంటూ పయనిస్తుండగా.. అడవిలో కనిపించిన ఓ శిల ముందు ఆగిపోతాడు. మనసులో ఏదో తెలియని ఆనందం, అప్పటివరకూ అతనికి నిద్రలేకుండా చేసిన చింత మొత్తం మాయమైపోతుంది. దాంతో.. ఆ దేవుని శిలను తనకు ఇచ్చేయమని, దానికి బదులుగా ఏం కావాలన్నా ఇస్తానని అక్కడి గ్రామ ప్రజలను కోరతాడు.
ఆ శిలకు బదులుగా.. ఆ అడవి మొత్తాన్ని సదరు ప్రజలకు ఇచ్చేయాలని, మళ్ళీ ఆ భూమిని లాక్కోవడానికి ప్రయత్నించకూడదని మాట తీసుకుంటాడు మనిషికి పట్టిన దేవుడు.
కట్ చేస్తే.. 1990లో సదరు భూమిని మళ్ళీ స్వంతం చేసుకోవడం కోసం ఆ రాజు కుటుంబం ఎన్ని విధాలుగా ప్రయత్నించింది? దాన్ని దేవుడు ఎలా అడ్డుకున్నాడు? అనేది “కాంతార” కథాంశం.
నటీనటుల పనితీరు: ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాక దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి.. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించి.. ఈ చిత్రానికి ప్రాణప్రతిష్ట చేశాడు. మొరటు యువకుడిగా ఎంత హుందాగా నటించాడో.. భూత కోలా ఆడుతున్న తరుణంలో దైవాంశ శంభూతునిగా అంతే దివ్యంగా కనిపించాడు. దేవుడు పట్టినప్పుడు అతడి అరుపులు థియేటర్లో మారుమ్రోగడమే కాదు.. సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మెదడులో మెదులుతూనే ఉంటుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
రీజనల్ సినిమాల్లో రీజనల్ హీరోయిన్ ఉండడం అనేది ఎంత పెద్ద ప్లస్ పాయింట్ అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఇది. హీరోయిన్ సప్తమి గౌడ ఎంతో సహజంగా, స్వచ్ఛంగా కనిపించింది. పాత్రలోనూ చక్కగా ఇమిడిపోయింది.
సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్ క్యారెక్టరైజేషన్ ను ముందే కాస్త గెస్ చేయగలిగినా.. సదరు పాత్రను డిజైన్ చేసిన తీరు మాత్రం అబ్బురపరుస్తుంది. అలాగే కిషోర్ పాత్రతో క్రియేట్ చేసిన టెన్షన్ బాగుంది. ఈగోయిస్టిక్ ఆఫీసర్ గా కిషోర్ నటన & స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నాయి. మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాధ్ ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్. తనదైన సంగీతం & సౌండ్ డిజైనింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. ముఖ్యంగా భూత కోలా బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. కర్ణాటిక్ సంగీతానికి ఫ్యూజన్ మిక్స్ చేసి, వోకల్స్ తో మ్యాజిక్ క్రియేట్ చేసిన తీరు అద్భుతం. నేపధ్య సంగీతంతోనూ కథను ఎలివేట్ చేసిన విధానం ప్రశంసార్హం.
అరవింద్ ఎస్.కశ్యప్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ. లిమిటెడ్ లొకేషన్స్ లో ఎక్కడా రిపిటీషన్ అనేది లేకుండా విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని ప్రెజంట్ చేయడం మామూలు విషయం కాదు. ముఖ్యంగా చివరి 20 నిమిషాల ఎపిసోడ్ ను రోమాంచితంగా చిత్రీకరించిన విధానం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించింది.
ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, మేకప్ వంటి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ తమ బెస్ట్ ఇచ్చాయి.
ఇక ఈ చిత్రానికి కథానాయకుడు, కథకుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుత తరం మర్చిపోతున్న ఓ సంస్కృతిని కథాంశంగా ఎంచుకోవడమే పెద్ద రిస్క్. ఇక ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. కేవలం కథకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కథనాన్ని అద్భుతంగా రాసుకోవడం, కథానాయకుడిగా నటించి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేయడం అనేది మామూలు అచీవ్మెంట్ కాదు. టెక్నికాలిటీస్ ను కాకుండా కథ-కథనాన్ని నమ్ముకుంటే ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయొచ్చో ప్రూవ్ చేశాడు రిషబ్. చాలా చిన్న కాన్వాస్ లో కాంతార చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా, కథకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు.
ముఖ్యంగా కథనం కొత్తది కాదు, ఈ తరహా సినిమాలను వందల సంఖ్యలో చూసేశామ్.. కానీ ఆ కథనాన్ని నడిపించిన తీరు, దేవుడ్ని జొప్పించిన విధానం అభినందనీయం. ఈమధ్య కాలంలో సౌండ్ డిజైన్ విషయంలో ఈస్థాయిలో జాగ్రత్తపడిన చిత్రమిదే అని చెప్పాలి. దర్శకుడిగా, కథకుడిగా, నటుడిగా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో 1000% విజయం సాధించాడు రిషబ్. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ వస్తుందా అని కాదు.. ఎన్ని ఇవ్వాలని జ్యూరీ లెక్కలేసుకునే తీర్చిదిద్దాడీ చిత్రాన్ని.
విశ్లేషణ: మన మూలాలను మనం మరువకూడదు. మన అస్తిత్వాన్ని కోల్పోకూడదు. ఈ రెండు విషయాలను ఎంతో నేర్పుతో చెప్పిన చిత్రం “కాంతార”. అద్భుతమైన సౌండ్ డిజైనింగ్, అజనీష్ లోక్నాధ్ సంగీతం, రిషబ్ నటన-దర్శకత్వం, భూత కోలా ఎపిసోడ్స్ & చివరి 20 నిమిషాల కోసం “కాంతార” చిత్రాన్ని థియేటర్లో రెండుసార్లు చూసినా తనివి తీరదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే.. ప్రతి ఒక్క సినిమా అభిమాని కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా “కాంతార”.
రేటింగ్: 4/5
Rating
4
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus