‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎవరో వ్యక్తి ఆ సినిమా గురించి ఏదో మాట్లాడితే ప్రముఖ సౌండ్ ఇంజినీర్ రసూల్ పుకుట్టి ‘గే లవ్ స్టోరీ’ అనే కామెంట్ పెట్టారు. అక్కడి నుండి ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. దీనిపై ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ రిప్లై ఇచ్చారు. అంతకుముందే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆ కామెంట్‌కి రిప్లై ఇచ్చారు. అయితే ఏమైందో ఏమో డిలీట్ చేశారు. ఈ ట్వీట్ – డిలీట్ కార్యక్రమం వరుసగా రెండో రోజూ జరిగింది. దీంతో చర్చ కీరవాణివైపు వచ్చేసింది.
రసూల్ పుకుట్టి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఎందుకు ‘గే లవ్‌స్టోరీ’ అన్నారో తెలియదు కానీ… సోషల్ మీడియా వేదికగా మంటలు చెలరేగాయి. అంతర్జాతీయ స్థాయిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ని మెచ్చుకుంటూ ట్వీట్లు పెడుతుంటే… సౌత్ సినిమా నుండి వచ్చిన రసూల్ ఇలా మాట్లాడటం సరికాదు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కథ నచ్చకపోతేనో, పూర్తిగా సినిమా నచ్చకపోతే ఆ మాట చెప్పాలి కానీ ‘గే లవ్‌స్టోరీ’ అనడమేంటి అని అడుగుతున్నారు. దీనిపై ఎవరెలా కామెంట్ చేసినా కీరవాణి కామెంట్లు, డిలీట్లే ఇప్పుడు ఆసక్తిగా ఉన్నాయి.
రసూల్ కామెంట్స్‌తో రంగంలోకి దిగిన కీరవాణి అప్పర్ కేస్, లోయర్ కేస్ అంటూ ఇంగ్లిష్ పదాలను తెలివిగా వాడుతూ రసూల్ మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందులో కొంత ద్వందార్థం ప్రతిబింబించేలా కొన్ని పదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మీదే విమర్శలు వచ్చాయి. విషయం అర్థం చేసుకున్న కీరవాణి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. మళ్లీ మంగళవారం ట్వీట్లేమీ చేయలేదు. కానీ బుధవారం ఉదయం కీరవాణి మరికొన్ని ట్వీట్లు చేశారు. ఈసారి తనకు క్యారెక్టర్ బ్లైండ్‌నెస్ వచ్చిందని, ‘ఆర్‌ఆర్ఆర్’లో రామ్ – భీమ్ పాత్రలు కనిపించడం లేదని ట్వీట్ చేశారు.
దాంతోపాటు తనకు సినిమాలో మల్లి తల్లి పాత్ర, అజయ్ దేవగణ్ పాత్రలే కీలకంగా కనిపిస్తున్నాయని చెప్పారు. తన ఇబ్బంది గురించి మాట్లాడదామంటే వైద్యులు అందుబాటులో లేరంటూ ఏదేదో రాసుకొచ్చారు. అయితే కాసేపటికే ఆ ట్వీట్లు కూడా డిలీట్ చేశారు. దీంతో కీరవాణి ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి గురువారం ఏం ట్వీట్లు చేస్తారో, డిలీట్ చేస్తారో చూడాలి.