Manorathangal Web Series OTT: 5 భాషలు.. 9 మంది స్టార్లు.. ఈ సిరీస్ చూడటానికి 2 కళ్లు చాలవు!
- July 17, 2024 / 05:31 PM ISTByFilmy Focus
కొన్ని కాంబినేషన్లను చూడటానికి రెండు కళ్లు చాలవు అంటుంటారు. ఇద్దరో, ముగ్గురో కలిస్తేనే అలా అనిపిస్తే.. తొమ్మిది మంది స్టార్లు కలిస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. దీనికి ఇప్పుడు కనిపిస్తున్న నిలువెత్తు రూపం ‘మనోరథంగల్’. కమల్ హాసన్ (Kamal Haasan) , మమ్ముట్టి (Mammootty) , మోహన్ లాల్ (Mohanlal), ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) , మధుబాల (Madhoo Bala) తదితర తొమ్మిదిమంది తారలతో, తొమ్మిది కథలతో ‘మనోరథంగల్’ అనే ఆంథాలజీ సిరీస్ సిద్ధం చేశారు. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ డేట్ బయటికొచ్చింది. మలయాళ రచయిత, దర్శకుడు ఎమ్.టి. వాసుదేవన్ నాయర్ రాసిన కొన్ని కథల ఆధారంగా ‘మనోరథంగల్’ సిరీస్ రూపొందుతోంది.
విక్రమ్ మెహ్ర, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఎనిమిది మంది దర్శకులు ప్రియదర్శన్ (Priyadarshan) , సంతోష్ శివన్ (Santosh Sivan) , రంజిత్, శ్యామ్‌ప్రసాద్, జయరాజన్ నాయర్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్, మహేశ్ నారాయణ్ ఈ ఆంథాలజీని రూపొందించారు. ఎమ్.టి వాసుదేవన్ నాయర్ 90వ పుట్టిన రోజు సందర్భంగా ‘మనోరథంగల్’ ట్రైలర్ విడుదల చేశారు.

ఎన్నో ఉన్న ఈ ప్రకృతిలో ఏదో అద్భుతం ఉంది అంటూ కమల్ హాసన్ చెప్పిన వ్యాఖ్యలతో మొదలైన ట్రైలర్‌లో భిన్నమైన వ్యక్తిత్వంతో జీవితం గడుపుతున్న ప్రధాన పాత్రధారులు మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్ పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) , బిజూ మేనన్ (Biju Menon) , జో మాథ్యూ, మధుబాల, అపర్ణ బాలమురళి (Aparna Balamurali) ప్రయాణాన్ని చూపించిన తీరు ఆసక్తిని పెంచుతోంది. ఈ సిరీస్‌ను వచ్చే నెల 15న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో జీ5 ఓటీటీలో స్ట్రీమ్ చేస్తారు.

తెలుగులో ఎంతో ఘనంగా రిలీజ్ చేస్తామని టీమ్ చెబుతున్న ఈ ఆంథాలజీ సిరీస్‌లో తెలుగు నటులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. అయితే నటించిన చాలా మంది తెలుగు జనాలకు తెలిసి ఉండటంతో దీనికి ఇక్కడ కూడా మంచి స్పందన వస్తుంది అని చెబుతున్నారు. అయితే ఆంథాలజీలకు సౌత్‌లో అంత మంచి ఆదరణ ఉండదు అనేది గత అనుభవం.















