విజయ్ వర్మ (Vijay Varma) ప్రధాన పాత్రలో నటించిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ (IC 814 The Kandahar Hijack) వెబ్ సిరీస్ గురించి గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో హైజాకర్ల పేర్లు విషయంలో మొదలైన చర్చ ఏకంగా నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు వెళ్లేంతవరకు వెళ్లింది. ఇప్పుడు ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్ నాలుక కరుచుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెబ్ సిరీస్‌లో చూపించిన వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్‌కుకేంద్రం సమన్లు జారీ చేసింది.
IC 814 The Kandahar Hijack
దీంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ విభాగం హెడ్ మోనికా షెర్గిల్ హాజరయ్యారు. కంటెంట్ విషయంలో రివ్యూ చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు కొన్ని మార్పులు కూడా చేశారు. హైజాకర్ల పేర్లను మేకర్స్ మార్చినట్టు తెలిపారు. సిరీస్ ప్రారంభంలో వచ్చే డిస్కక్లయిమర్‌లో వారి అసలు పేర్లు మినహా సిరీస్‌లో మరే మార్పులు చేయలేదని క్లారిటీగా చెప్పేశారు.
హైజాకర్ల ఒరిజినల్ పేర్లను ఎందుకు స్పష్టంగా సిరీస్‌లో చూపించలేదు, హైజాకర్లను మానవత్వం ఉన్నవారిగా చూపించారు? మధ్యవర్తులను బలహీనపరులుగా, గందరగోళానికి గురవుతున్నవారిగా ఎందుకు చూపించారు? అని కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌ను ప్రశ్నించిందని టాక్. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండేలా కంటెంట్‌ను ప్రసారం చేస్తామని నెట్‌ఫ్లిక్స్ చెప్పింది. భారత విమానాన్ని 1999లో పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ తదనంతర పరిణామాలతో ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్’ (IC 814 The Kandahar Hijack) వెబ్ సిరీస్ రూపొందింది.
ఇందులో హైజాకర్ల పేర్లను ‘శంకర్’, ‘భోలా’ అని మార్చారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఇక కెప్టెన్ దేవిశరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన పుస్తకం ‘ఫ్లైట్ ఇన్‌టూ ఫియర్’ ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఆగస్టు 29న నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా ఈ సిరీస్ విడుదలైంది. దీంతో కంటెంట్ విషయంలో ముఖ్యంగా దేశ ప్రజలను ప్రభావితం చేసే కంటెంట్ విషయంలో, అందులోనూ జరిగిన విషయం ఆధారంగా తీసిన కంటెంట్ విషయంలో ముందు జాగ్రత్త తీసుకోకుండా నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను రూపొందించింది అని అర్థమవుతోంది.