ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా విడుదలైనా నాలుగు నుంచి ఆరు వారాలలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని పెద్ద సినిమాలు రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఏజెంట్, ది కేరళ స్టోరీ, కనెక్ట్ సినిమాలు మాత్రం ఎప్పుడు ఓటీటీలలో విడుదలవుతాయనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకడం లేదు. ఈ క్రేజీ సినిమాలు ఓటీటీలో రిలీజయ్యే ఛాన్స్ లేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఏజెంట్, ది కేరళ స్టోరీ, కనెక్ట్ సినిమాలకు ఏమైందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ ఏజెంట్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి.
సోనీ లివ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకోగా కోర్టు కేసుల వల్ల ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అశ్విన్ శరవణన్ డైరెక్షన్ లో నయన్ హీరోయిన్ గా తెరకెక్కిన కనెక్ట్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఈ మూవీ రైట్స్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నా ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందో స్పష్టత లేదు.
ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన (The Kerala Story) ది కేరళ స్టోరీ సినిమా సైతం ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. సెన్సిటివ్ కంటెంట్ తో తెరకెక్కిన మూవీ కావడం వల్లే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్ల గురించి స్పష్టత వస్తుందేమో చూడాలి. ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.