గత వారం రోజులుగా అలేఖ్య పికిల్స్ వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రేట్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు అసభ్యంగా బదులిచ్చిన అలేఖ్య వాయిస్ మెసేజ్ వైరల్ అవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘ఒక చిన్న ప్రశ్నకు ఈ రేంజ్‌లో తిట్లా?’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో అలేఖ్య సిస్టర్స్ తమ వెబ్‌సైట్, వాట్సాప్ ఖాతాలను డీలీట్ చేసి, చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
అలేఖ్య, సుమ, రమ్య కలిసి నాన్ వెజ్ పికిల్స్‌తో పేరుగాంచారు. వంకాయ పీతల పచ్చడి, చేపల పచ్చడి, రొయ్యల పచ్చడి వంటి ఐటెంలకు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ “రేట్ ఎక్కువ” అన్న మాటతోనే తిట్ల ధార పారడటంతో, వ్యాపారంలో నమ్మకాన్ని కోల్పోయారు. ఒక కస్టమర్‌ను నొప్పించడమే కాక, అన్ని సోషల్ మీడియా వేదికలపై ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే సమయంలో మెగా కోడలు ఉపాసన ప్రారంభించిన ‘అత్తమ్మాస్ కిచెన్’ (Athamma’s Kitchen) ధరలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖ వంటలతో రూపుదిద్దుకున్న ఈ బ్రాండ్ పులిహోర పేస్ట్, రసం పౌడర్, పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్ వంటి పదార్థాలను విక్రయిస్తోంది. కానీ వీటి ధరలు చూసి కూడా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మూడు పులిహోర పేస్ట్ ప్యాకెట్లు రూ.1170కు ఉంటే ఐదు రసం పౌడర్ ప్యాకెట్స్ రూ.1185కు అమ్ముతున్నారు. ఇక ఉప్మా మిక్స్ ప్యాకెట్స్ 5 కాంబో రూ.1175కు.. 5 పొంగల్ మిక్స్ ప్యాక్స్ రూ.1185కు విక్రయిస్తున్నారు.
ఒక్కో కాంబోలో మూడు నుంచి ఐదు ప్యాకెట్లున్నా.. ధర కాస్త ఎక్కువే అని నెటిజన్లు పేర్కొంటున్నారు. “బ్రాండ్, క్వాలిటీ ఓకే కానీ, పేద మధ్యతరగతి వాళ్లకు ఇది అందుబాటులోనా?” అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఉపాసన మాత్రం టేస్ట్, హోమ్ కుక్‌డ్ కాన్సెప్ట్‌తో నమ్మకాన్ని బలపరిచే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులకు, కార్పొరేట్ క్యాంటీన్లకు ఈ ప్రొడక్ట్స్ సప్లై అవుతున్నాయి. మొత్తానికి అలేఖ్య కామెంట్స్, అత్తమ్మాస్ (Athamma’s Kitchen) ధరలు.. రెండూ ఇప్పుడు నెటిజన్ల హాట్ టాపిక్స్.