ప్రస్తుతం ‘సాహో’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఆగష్టు 15 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో… ఇప్పటి నుండే ప్రమోషన్లు మొదలు పెట్టేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ప్రభాస్ అభిమానుల దృష్టి కూడా ఈ చిత్రం పైనే ఉంది. కానీ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మాత్రం ప్రభాస్ తో పాటు ఆయన అభిమానుల్ని కూడా అయోమయంలో పడేసాడు. విషయం ఏమిటంటే ప్రభాస్ రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పాడు.
తాజాగా విజయవాడలో జరిగిన ‘భారతీయ జనతాపార్టీ’ (బి.జె.పి) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు హాజరయ్యారు. ఆయన ఉపన్యాసంలో మోడీని ఆకాశానికెత్తేస్తూ… ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే… ప్రభాస్ ఫ్యాన్స్ అంతా బి.జె.పి లో చేరాలని పిలుపునివ్వడం సంచలనంగా మారింది. కృష్ణంరాజు మాట్లాడుతూ… “నేనెప్పుడూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎటువంటి కోరిక కోరలేదు. ప్రస్తుత పరిస్థితులలో సమస్యలతో సతమతమైపోతున్న ఆంధ్రప్రదేశ్ కు ఒక్క బి.జె.పి ప్రభుత్వం మాత్రమే పరిష్కారాలు చూపగలదు…. కాబట్టి ఆ లక్ష్యసాధనకు ప్రభాస్ అభిమానుల సహకారం కావాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ప్రమేయం ఏమాత్రం లేకుండా కృష్ణంరాజు ఇలా మాట్లాడి ఉండకూడదంటూ కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎంతో మంది పెద్ద హీరోలు పార్టీలు పెట్టి… భారీ ఎత్తున ప్రచారం చేస్తేనే గెలవలేని పరిస్థితులు’ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా పార్టీలో మద్దతు ఇచ్చినంత మాత్రాన మూల పడిపోయిన పార్టీ గెలుస్తుందా’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.