హారర్ కామెడీకి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence) “కాంచన” సిరీస్‌లో నాలుగో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. గత మూడు చిత్రాలు కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, హారర్ థ్రిల్ కలిగించాయి. అయితే ఈసారి లారెన్స్ మరో హారర్ సినిమా చూపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్ చిత్రాలకు నటుడిగా, దర్శకుడిగా మాత్రమే వ్యవహరించిన లారెన్స్, “కాంచన 4” కోసం నిర్మాతగా మారుతున్నాడు. ఈ నిర్ణయం ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
Raghava Lawrence
గతంలో “కాంచన” సిరీస్ నిర్మాణంలో లారెన్స్ ఆర్థిక బాధ్యతలు తీసుకోలేదు. కానీ ఈసారి సొంత డబ్బుతో రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. గత చిత్రాలు లాభాలు మాత్రమే తెచ్చిపెట్టినప్పటికీ, డిస్ట్రిబ్యూటర్స్ కు కొన్ని సమస్యలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. “కాంచన 4″తో అలాంటి అనుభవాలకు తావు లేకుండా మొత్తం లాభాలను తన చేతుల్లోకి తీసుకునేందుకు లారెన్స్ ప్రణాళిక వేశారు. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ తో పాటు, కొత్త తరహా కామెడీ, ఎమోషనల్ డ్రామాను జోడించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లారెన్స్ భావిస్తున్నాడు.
ఈసారి కథలో మరింత గ్రిప్ ఉండేలా స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. 2025 ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించనున్నట్లు సమాచారం. తెలుగులో వరుస ఫ్లాప్స్‌తో వెనుకబడ్డ పూజ, కోలీవుడ్‌లో మళ్ళీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. “కాంచన 4” ఆమె కెరీర్‌కు కొత్త ఆఫర్స్ ను అందించే అవకాశం కల్పించవచ్చని టాక్.
కోలీవుడ్‌లో “సూర్య 44,” “థలపతి 69” వంటి భారీ ప్రాజెక్టుల్లోనూ పూజ కీలక పాత్రలో నటిస్తోంది. లారెన్స్ తన స్టైల్ లో “కాంచన 4″ను రూపొందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. హారర్, కామెడీ, ఎమోషన్ మిళితమైన ఈ ఫ్రాంచైజీ ఇప్పటికే ఒక బ్రాండ్‌గా నిలిచింది. మరి ఈసారి లారెన్స్ తీసుకున్న బిగ్ రిస్క్ కాంచన సిరీస్‌కు కొత్త రికార్డులు తెచ్చిపెడుతుందా లేదా అనేది వేచి చూడాలి.