రాజమౌళి (SS Rajamouli) ముందు అనుకున్నది అనుకున్నట్లుగా తీసుంటే… మనం ఇప్పుడు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్లు ఇలా ఉండేవి కావు. అవును నిజం.. ఈ మాట ఆయనే చెప్పారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రచారం కోసం జపాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే… ఆ సినిమా క్లైమాక్స్ విషాదాంతం అయ్యేది. అయితే ఎందుకో కానీ అలా బాగోదు అనిపించి ఎడిటింగ్‌లో ఆ సీన్స్ తీసేశారట. దీంతో ఇప్పుడు వేరే క్లైమాక్స్ మనం చూస్తున్నామట.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘RRR’. 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా గురించి జపాన్‌లో ఆయన మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి ఇప్పటివరకూ బయటకు రాని విషయాన్ని చెప్పారు. భీమ్ (తారక్), జెన్నీ (ఒలీవియా మోరిస్) మధ్య మరికొన్ని సీన్స్ ఉన్నాయని, అయితే నిడివి ఎక్కువైన కారణంగా ఎడిటింగ్‌లో తీసేశామని చెప్పారు. దీంతో క్లైమాక్స్ కూడా మారిపోయిందని తెలిపారు.
భీమ్‌ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ అతడిని కలుస్తుందట. జైలు నుండి తప్పించడానికి సాయం చేయాలనుకుంటుందట. స్కాట్ (రే స్టీవెన్‌సన్) గదిలోకి వెళ్లి, అక్కడి ప్లాన్స్‌ను దొంగిలించి భీమ్‌కు ఇస్తుందట. అక్కడి నుండి తిరిగి వస్తుండగా, స్కాట్ భార్య (అలీసన్ డూడీ) ఆమెను చూస్తుందట. జెన్నీ బూట్లకు ఉన్న మట్టిని చూసి ఆ విషయాన్ని స్కాట్‌కు చెబుతుందట. ఆ తర్వాతే భీమ్ తప్పించుకుని పారిపోతాడు. దీంతో రామ్‌ను జైల్లో పెడతారు.
ఆ తర్వాత రామ్ గురించి అసలు విషయం తెలుసుకున్న భీమ్ మళ్లీ జైలుకు వచ్చి రామ్‌ను కాపాడి బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత అడవిలో బ్రిటిష్ సైన్యాన్ని సంహరించుకుంటూ రామ్ – భీమ్ వెళ్తున్నప్పుడు జెన్నీని పావుగా వాడుకుని వాళ్లను పట్టుకోవాలని స్కాట్ అనుకుంటాడట. వెంటనే లొంగిపోమ్మని లేకపోతే జెన్నీని చంపేస్తానని బెదిరిస్తాడట. లొంగిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలోనే జెన్నీని స్కాట్ చంపేస్తాడట. అలా ఒరిజినల్ వెర్షన్‌లో జెన్నీ చనిపోతుందట. కానీ యాంటీ క్లైమాక్స్ ఎందుకు అనిపించి జక్కన్న ఆ సీన్స్ తీసేశారట. దీంతో ఇప్పటిక క్లైమాక్స్ ఉంది.