థియేటర్లలో సినిమాను ఓటీటీలు దాటేస్తాయి అంటూ గత కొన్నేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా అనే చర్చ ఒకవైపు జరుగుతుంటే.. మా సినిమాల్ని, మా కంటెంట్‌ను ఓటీటీలు అస్సలు పట్టించుకోవడం లేదు అంటూ గొంతులు లేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ గొంతు బలంగా తన వాయిస్, ఇంకా చెప్పాలంటే తమ వాయిస్‌ను వినిపించింది. ఆ గొంతే ప్రముఖ నటుడు, దర్శకుడు రక్షిత శెట్టి (Rakshit Shetty).
‘777 చార్లీ’, ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) లాంటి సినిమాలతో తెలుగు సినిమాకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఓటీటీ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (మాజీ ట్విటర్)లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. రక్షిత్ శెట్టి నిర్మాతగా తెరకెక్కించిన ‘ఏకమ్’ అనే వెబ్ సిరీస్ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఏకమ్’ వెబ్ సిరీస్‌ను 2020 నుండి రిలీజ్ చేయడానికి సుమారు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ముందుకు రాలేదు. కరోనా పరిస్థితుల వల్ల తొలుత రిలీజ్‌కు బ్రేక్ పడింది. అంతా ఓకే, పరిస్థితులు కుదుటపడ్డాయి అనుకున్నాక ఈ ఏడాది మే నెలలో మళ్లీ అనుకున్నాం. కానీ ఒక్క ఓటీటీ సంస్థ కూడా ముందుకు రాలేదు. ఓటీటీలు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి అని రక్షిత్ ఆరోపించారు.
అసలు ఓటీటీలు కన్నడ కంటెంట్‌ను ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు అని ప్రశ్నించారు. కన్నడలో తెరకెక్కిన హిట్ సినిమాలు, పెద్ద సినిమాలను మాత్రమే ఓటీటీలోకి తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఓటీటీల్లో కన్నడ సినిమాలు వెనుకబడ్డాయి అని రక్షిత్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ వెబ్ సిరీస్‌ను తమ సొంత ప్లాట్‌ఫామ్ మీద రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.