మూడేళ్ల విరామం తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అన్ని ఏరియాల నుండి ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఇదిలా ఉండగా.. పవన్ లాంటి హీరోతో సినిమా అంటే దర్శకులంతా రెడీగా ఉంటారు. అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం దానికి భిన్నంగా కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తో తాను సినిమా చేయలేనని అన్నారు.
పవన్ అంటే వ్యక్తిగతంగా తనకు ఇష్టమని చెప్పిన వర్మ.. ‘వకీల్ సాబ్’ సినిమాను ఇంకా చూడలేదని.. కానీ రివ్యూలు విన్నానని అన్నారు. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని.. కానీ పవన్ సినిమాలు ఎక్కువగా చూడనని అన్నారు. ‘వకీల్ సాబ్’ కూడా చూడలేదని, కానీ ట్రైలర్ చూశానని, బాగుందని అన్నారు. అయితే పవన్ కు ఉన్న ఇమేజ్, హీరోయిజం, ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన అభిమానులకు ఆయన సినిమాపై ఉండే అంచనాలకు తగ్గట్లుగా సినిమా చేయడం తన వల్ల కాదని అన్నారు.
హీరోయిజం చూపించే కమర్షియల్ సినిమాల కంటే.. జోనర్ సినిమాలను ఎక్కువగా చేయడానికి ఇష్టపడతానని అన్నారు. పవన్ లాంటి హీరోతో తను సినిమా చేస్తే అది వాళ్లకే కాదు.. సినిమాకి కూడా మంచిది కాదని అన్నారు. అంతేకాకుండా.. కమర్షియల్ సినిమాలు చేయాలనే ఆసక్తి తనకు లేదని వర్మ అన్నారు. ప్రస్తుతం వర్మ డైరెక్ట్ చేసిన ‘ఆర్జీవీ దెయ్యం’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.